ముగ్గురు ఎంపీలు వర్సెస్ కేసీఆర్... అందరి దృష్టీ ఆ మూడు సెగ్మెంట్లపైనే...

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనానికి చావు దెబ్బ తిన్న బీజేపీ... ఎంపీ ఎన్నికల్లో మాత్రం ఊహించనిస్థాయిలో ఉపశమనం పొందింది. ఏకంగా నాలుగు ఎంపీ స్థానాల్లో గెలుపొందటమే కాదు, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితతోపాటు ...టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత వినోద్ కుమార్ ను ఓడించటంతో కమలానికి మైలేజీ పెంచింది. అయితే, ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ బీజేపీ కనీస ప్రభావం చూపలేకపోయింది. కానీ, టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్యాయమని, 2024లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది బీజేపీయేనని కమలనాథులు బల్లగుద్దిమరీ చెబుతూ వస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలో వచ్చిన మున్సిపాలిటీ ఎన్నికలు, కమలం సత్తా ఏంటో నిరూపించుకోవాల్సిన పరిస్థితిని తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అత్యంత కీలకంగా మారాయి. దాంతో, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీలైన బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావుకు మున్సిపల్ ఎన్నికలు అగ్నిపరీక్షగా నిలిచాయి.

కరీంనగర్ లోక్ సభ సెగ్మెంట్ పరిధిలో కరీంనగర్ కార్పొరేషన్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కొత్తపల్లి, హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్ మున్సిపాలిటీలు ఉన్నాయి. నిజామాబాద్ లోక్​సభ పరిధిలో నిజామాబాద్ కార్పొరేషన్, మెట్ పల్లి, కోరుట్ల, జగిత్యాల, ఆర్మూర్, భీంగల్, బోధన్ మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటన్నింటిలో గెలుపు బాధ్యత సంజయ్, అర్వింద్‌పై పడింది. ఇక సోయం బాపూరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఖానాపూర్, కాగజ్ నగర్ మున్సిపాలిటీల్లో గెలుపుపైనా పార్టీలో ఆశలు ఉన్నాయి. దాంతో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాదుల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఇక, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో జీహెచ్ఎంసీకి ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా... హైదరాబాద్ నగర శివార్లలోని మల్కాజ్​గిరి, చేవెళ్ల లోక్​సభ సెగ్మెంట్ల పరిధిలోని ఏడు కార్పొరేషన్ సీట్లు, అలాగే, 20వరకు మున్సిపాలిటీల్లో పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిపైనే ఉంది. బడంగ్ పేట్, మీర్ పేట్, బండ్లగూడ జాగీర్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్ కార్పొరేషన్ స్థానాలు... అలాగే, శంషాబాద్, మేడ్చల్, ఘట్ కేసర్, కొంపల్లి, దుండిగల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, పెద్ద అంబర్ పేట్ వంటి కీలక మున్సిపాలిటీలు ఇందులో ఉన్నాయి. హైదరాబాద్ కు ఆనుకుని ఉండడంతో వీటిల్లో గౌరవప్రదమైన స్థాయిలో సీట్లు సాధించాలని భావిస్తోంది బీజేపీ.

అయితే, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు ప్రాతినిథ్యం వహిస్తోన్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై అధికార టీఆర్ఎస్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఎంపీ ఎన్నికల్లో ఓటమికి బదులు తీర్చుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ మూడు పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్... తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై గులాబీ జెండా ఎగురవేయడమే కాకుండా బీజేపీని మానసికంగా దెబ్బకొట్టాలని భావిస్తున్నారు. దాంతో, ఈ ముగ్గురు ఎంపీల పరిధిలో జరిగే ఎన్నికలు హోరాహోరీగా మారాయి. అయితే, అధికార టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొనేందుకు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావులు కూడా ఈ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకున్నారు. అభివృద్ధి, హిందుత్వవాదంతో ప్రజల దగ్గరకు వెళ్తున్నారు. తమతమ పార్లమెంట్ సెగ్మెంట్స్ పరిధిలో మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం చేసుకుని బీజేపీ అధిష్టానం దగ్గర తమ పలుకుబడిని మరింత పెంచుకునేందుకు పట్టుదలతో పనిచేస్తున్నారు. మరి, మున్సిపోల్స్ లో ఈ ముగ్గురు ఎంపీల స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందో... లేక... ఎంపీ ఎన్నికల్లో ఓటమికి కేసీఆర్ బదులు తీర్చుకుంటారో చూడాలి.

మొత్తానికి తెలంగాణ మున్సిపోల్స్ లో అందరి దృష్టీ ఇఫ్పుడు ముగ్గురు బీజేపీ ఎంపీలపైనే ఉంది. ఎందుకంటే, ఆ ముగ్గురి వల్లే తెలంగాణలో బీజేపీకి మళ్లీ ఊపొచ్చింది. ఏమీ లేదనుకున్న పార్టీని ఔరా ఇంతుందా అనిపించేలా చేశారు ఈ ముగ్గురూ. పార్టీ లేదనుకున్న చోట... దిగ్గజాలను ఓడించారు. అంచనాలను మించిన ఆ విజయమే... ఇప్పుడు మున్సిపోల్స్‌ రూపంలో వారిపై ఒత్తిడి పెంచింది. అంతేకాదు, పార్లమెంట్ ఎన్నికల తరువాత బీజేపీలో మునుపటి జోష్ లేదన్న ప్రచారం ఓ వైపు, వాపును చూసి కమలం పార్టీ నాయకులు బలుపు అనుకుంటున్నారన్న టీఆర్‌ఎస్ నేతల కౌంటర్ల నేపథ్యంలో, ఆ ముగ్గురు ఎంపీలకు మున్సిపల్ ఎన్నికలు సవాల్‌గా మారాయి. కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు కూడా ఈ ముగ్గురు ఎంపీలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరి, ఎంపీ ఎన్నికల్లో సంచలనం సృష్టించినట్లే.... మున్సిపోల్స్ లోనూ సత్తా చాటి తమకు తిరుగులేదని నిరూపించుకుంటారో లేక ...చతికిలపడతారో కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది.