ఉమ్మడి వరంగల్ జిల్లాలో కారు జోరు!!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 9 మునిసిపాలిటీల పరిధిలో కౌంటింగ్ ప్రక్రియ వేగవంతమైంది. ఉమ్మడి జిల్లాలో ఉన్న మూడు మునిసిపాలిటీల్లో గులాబీ జెండా రెపరెపలాడుతుంది. ప్రధానంగా డోర్నకల్  మంత్రి సత్యవతి రాథోడ్ ప్రాతినిధ్యం వహిస్తున్న డోర్నకల్ నియోజకవర్గంలో ఉన్న మరిపెడలో 15 కి 15 వార్డులను టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసి టీఆర్ఎస్ ఖాతాలో జమచేసుకుంది. అదే విధంగా వరంగల్ రూరల్ జిల్లాలో ఉన్న వర్దన్నపేట మునిసిపాలిటీలో ఇప్పటికే టీఆర్ఎస్ ఎనిమిది వార్డులను గెలుచుకుని అక్కడ మొత్తంగా చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. పరకాలలో ఉన్న 22 వార్డుల్లో 13 వార్డులతో టీఆర్ఎస్ కైవసం చేసుకోగా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న పది మున్సిపాలిటీల్లో మూడు మునిసిపాలిటీలను టిఆర్ఎస్ తన ఖాతాలో వేసుకోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటుకుంటున్నాయి. ప్రతి చోట టీఆర్ఎస్ అభ్యర్ధులు అప్రతిహతంగా ముందుకు పోతున్న వాతావరణం ఉంది. 

జనగామలో సగానికి పైగా ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. అక్కడ మూడు వార్డుల్లో బిజెపి, మూడు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. ఇక భూపాలపల్లి మునిసిపాలిటీలో మొత్తం టీఆర్ఎస్ అభ్యర్ధులు ఏకపక్ష విజయాన్ని నమోదు చేసే దిశగా పయనిస్తున్న పరిస్థితి ఉంది. ఇక ప్రతిష్టాత్మక వరంగల్ రూరల్ జిల్లాలో మరో మునిసిపాలిటీ ఉంది. నర్సంపేట మున్సిపాల్టీలో మాత్రం కౌంటింగ్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. మొత్తంగా మొదటి రౌండ్ కు సంబంధించిన ఫలితాలు చేరేసరికి కాంగ్రెస్ అభ్యర్థులు కొన్ని వార్డుల్లో గట్టి పోటీని ఇస్తున్నట్లు  చాలా స్పష్టంగా ఉంది.