టీఆర్ఎస్ సర్వేల కామెడీ!

 

టీఆర్ఎస్ చేస్తుస్తున్న సర్వేల వ్యవహారం సినిమా హీరోయిన్ల వయసు మాదిరిగా తయారైంది. హీరోయిన్లు అసలు వయసు ఎప్పుడూ బయటపెట్టరు. పదేళ్ళ ముందట ఎంత వయసు చెప్పారో పదేళ్ళ తర్వాత కూడా మాట తప్పకుండా అదే వయసు చెబుతారు. అదే విధంగా మాట తప్పడం అంటే ఏమిటో ఎంతమాత్రం తెలియని కేసీఆర్ కూడా ఇదే రూట్లో ట్రావెల్ చేస్తున్నాడు. ఆయన తన వయసు చెప్పే విషయంలో ఎలాంటి కామెడీ చేయడం లేదుగానీ, టీఆర్ఎస్ పార్టీకే ఈ ఎన్నికలలో రాబోయే సీట్ల విషయంలో మాత్రం బోలెడంత కామెడీ క్రియేట్ చేస్తున్నాడు. హీరోయిన్ల మాదిరిగా ఎప్పుడు అడిగినా ఒకే అంకె చెబుతున్నారు. టీఆర్ఎస్‌కి ఈ ఎన్నికలలో 70 అసెంబ్లీ సీట్లు తప్పకుండా వస్తాయని కేసీఆర్ బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు. తమ పార్టీ చేసిన సర్వేల సర్వేల ఆధారంగా ఈ విషయాన్ని చెబుతున్నానని ఆయన అంటున్నాడు. ఇది ఇప్పుడు కాదు. తెలంగాణ రాకముందు నుంచీ ఇదేమాట చెబుతున్నాడు. సార్ ఎప్పుడు సర్వే చేయించినా 70 సీట్లు వస్తాయని రిజల్టు వస్తోందంటే ఈ సర్వే రిపోర్టుని అనుమానించాల్సిందే. ఆ సర్వే చేసే సంస్థకి దండేసి దణ్ణం పెట్టాల్సిందే.

 

నిజానికి కేసీఆర్ సర్వేలు చేయించి 70 అంకె చెబుతున్నట్టుగా లేదని, నోటికొచ్చినట్టుగా ఎప్పటినుంచో ఒకే అంకెని పట్టుకుని వేలాడుతున్నట్టుగా వుందని రాజకీయ పరిశీకులు అనుమానంగా చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం ప్రజలు టీఆర్ఎస్‌ని లైట్‌గా తీసుకుంటున్నారని, ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ 35 నుంచి 40 సీట్లు మాత్రమే సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇంకా మాట్లాడితే ఈ మాత్రం సీట్లు కూడా వస్తాయో లేదోనన్న సందేహాలు కూడా వున్నాయని చెబుతున్నారు. ఈ వాస్తవం తెలుసుకున్న కేసీఆర్ తనకు తాను ఉత్సాహాన్ని ఇవ్వడానికో, పార్టీ నాయకులు నిరాశలో కూరుకుపోకుండా వుండటానికో తాను చేయించానని చెప్పుకునే సర్వే గురించి, 70 అంకె గురించి గుర్తు చేస్తూ వుంటాడని అంటున్నారు.