నిజామాబాద్ లో ముగ్గురు ఎమ్మెల్యేలు వర్సెస్ ఇద్దరు ఎంపీలు

నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో పోరు.... ముగ్గురు ఎమ్మెల్యేలు... వర్సెస్‌ ఇద్దరు ఎంపీలు అన్నట్లుగా మారింది. అధికార టీఆర్‌ఎస్‌కి‌... అలాగే, బీజేపీకి... నిజామాబాద్ కార్పొరేషన్‌ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి పట్టంకట్టిన ఇందూరు ఓటర్లు.... పార్లమెంట్‌ ఎన్నికల్లో అనూహ్యంగా కాషాయం వైపు మొగ్గుచూపడంతో ...ఇప్పుడు... ఏ పార్టీకి పట్టం కడతారనే ఉత్కంఠ రేపుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల వరకూ ...గులాబీ పార్టీకి నిజామాబాద్‌ జిల్లా కంచుకోటలా ఉండేది. అయితే, 2019 జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఊహించనివిధంగా కారు బోల్తాపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు మొత్తం స్థానాలను క్వీన్ స్వీప్ చేసిన టీఆర్ఎస్‌.... అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని కోల్పోయింది. ముఖ్యమంత్రి కుమార్తె కవితపై బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అర్వింద్‌ విజయఢంకా మోగించారు. అయితే, కవిత ఓటమికి ఎమ్మెల్యేల అశ్రద్ధే కారణమన్న ప్రచారం జరిగింది. అయితే, నిజామాబాద్‌ కార్పొరేషన్‌ గెలుపు బాధ్యతలను మళ్లీ ఎమ్మెల్యేలకే సీఎం కేసీఆర్ అప్పగించడంతో... పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎదుర్కొన్న అపవాదును చెరిపేసుకోవాలని భావిస్తున్నారు. అందుకే, అభ్యర‌్ధుల ఎంపిక దగ్గర్నుంచి... బి-ఫారాలు, బుజ్జగింపుల వరకు అన్నీ ఎమ్మెల్యేల స్వయంగా చేసుకుంటున్నారు. అయితే, గత ఎన్నికల్లో 10 డివిజన్లు మాత్రమే గెలుచుకుని, ఎంఐఎంతో కలిసి నిజామాబాద్‌ కార్పొరేషన్‌ను దక్కించుకున్న గులాబీ పార్టీ... ఈసారి సింగిల్‌గా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది.

నిజామాబాద్ కార్పొరేషన్‌లో... మొత్తం 60 డివిజన్లు ఉండగా... అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పరిధిలో 50 డివిజన్లు, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరిధిలో 8 డివిజన్లు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరిధిలో రెండు డివిజన్లు ఉన్నాయి. అయితే, గెలుపు బాధ్యతల్లో ప్రధాన పాత్ర బిగాలపైనా ఉన్నా... ముగ్గురు ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో అధికార టీఆర్ఎస్‌ పరిస్థితి ఇలాగుంటే, పార్లమెంట్ ఎన్నికల్లో కాషాయ జెండాను రెపరెపలాడించిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌... మరోసారి తన సత్తా చాటుకోవాలని చూస్తున్నారు. అభ్యర్ధుల ఎంపిక, ప్రచారం దగ్గర్నుంచి ...గెలుపు బాధ్యతలను తానే తీసుకుంటూ... కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. మరోవైపు అర్వింద్ తండ్రి డీఎస్‌ ప్రభావం కూడా నిజామాబాద్‌లో ఉంటుందని అంటున్నారు. అయితే, డీఎస్ అనుచరులంతా... బీజేపీలో చేరడంతో... ఆ బలం కూడా కాషాయ పార్టీకే కలిసొస్తుందని లెక్కలేస్తున్నారు. దాంతో, నిజామాబాద్ కార్పొరేషన్‌లో పోరు... ముగ్గురు ఎమ్మెల్యేలు... వర్సెస్‌ ఇద్దరు ఎంపీలు అన్నట్లుగా మారిందనే చర్చ జరుగుతోంది.  

ఓట్లు, విస్తీర్ణం పరంగా నిజామాబాద్ కార్పొరేషన్ పెద్దది కావడం... పార్లమెంట్‌ ఎన్నికల్లో... కమలం వికసించడంతో... ఇప్పుడు... ఏ పార్టీకి పట్టం కడతారనే ఉత్కంఠ రేపుతోంది. అసలు, నిజామాబాద్‌ ప్రజల నాడి ఎలాగుందనేది అంతుపట్టడం లేదు. అయితే, ఎప్పుడూ విలక్షణ తీర్పునిచ్చే ఇందూరు ఓటర్లు... ఈసారి ఎలాంటి సంచలనాలకు తెరలేపుతారో చూడాలి.