కేటీఆర్ ధీమా.. టీఆర్ఎస్ కైవసం చేసుకున్న మునిసిపాలిటీలు ఇవే!

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయ దుందుభీ కొనసాగుతోంది. మరిపెడ, ధర్మపురి, కొత్తపల్లి, చెన్నూరు, పరకాల, బాన్సువాడ అలాగే పెద్దపల్లి మున్సిపాల్టీలను టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మరిపెడలో మొత్తం అన్ని వార్డుల్లో క్లీన్ స్వీప్ చేసి మరిపెడ మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగురవేసింది. ధర్మపురి మున్సిపాల్టీ , కొత్తపల్లి మున్సిపాల్టీ, చెన్నూరు, పరకాల, బాన్సువాడ మరియు పెద్దపల్లి ఈ అన్ని మున్సిపాల్టీలను టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఐడీఏ బొల్లారం పై కూడా టిఆర్ఎస్ పార్టీ తన జెండా ఎగురవేసింది.  

మొదటి నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి కేటీఆర్ ఎటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారో ఆ ధీమా నూటికి నూరు శాతం నిజమైంది. తమ వ్యూహానికి తిరుగులేదంటూ మరోసారి పట్టణ ప్రజలు కేటీఆర్ వ్యూహానికి సపోర్ట్ చేస్తూ వారికి అండగా నిలిచారు. తెలంగాణ భవన్ లో ఫలితాల సరళిని పార్టీ నాయకులతో కలిసి వీక్షిస్తున్నారు కేటీఆర్.

ఇదిలా ఉంటే కేటీఆర్‌ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో స్వతంత్ర అభ్యర్థుల హవా కూడా కొనసాగింది. స్వతంత్రులు ఏకంగా 10 మంది గెలిచారు. మొత్తం 39 వార్డులకు ఓట్ల లెక్కింపు ముగియగా టీఆర్‌ఎస్‌ 24 వార్డుల్లో గెలిచింది. బీజేపీ 3, కాంగ్రెస్‌ 2 స్థానాలు దక్కించుకోగా, స్వతంత్రులు 10 స్థానాల్లో గెలుపొందారు. సిరిసిల్లలో మొత్తం వార్డులన్నీ టీఆర్ఎస్సే కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు భావించారు. కానీ అనూహ్యంగా స్వతంత్రులు 10 మంది గెలుపొందారు. ఈ 10 మంది కూడా టీఆర్ఎస్ రెబల్స్ కావడం విశేషం.