ఒకటి కవితకు... రెండోది పొంగులేటికి... గిది ఫైనల్ అంతే..!  

తెలంగాణలో ఖాళీ అవుతోన్న రెండు రాజ్యసభ సీట్లపై ఎప్పట్నుంచో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లే ఈ రెండు స్థానాలపై పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే, మొదట్నుంచీ కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. లోక్ సభలో గట్టిగా తెలంగాణ వాణి వినిపించి పేరు తెచ్చుకున్న కవిత... అనూహ్యంగా నిజామాబాద్లో ఓటమిపాలు కావడంతో... రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. అంతలోనే రాజ్యసభకు కాదు ఏకంగా రాష్ట్ర కేబినెట్లోకి తీసుకుంటారంటూ కథనాలు వచ్చాయి. అయితే, కవితను రాజ్యసభకు పంపడం ఖాయమైనట్లు తెలుస్తోంది. 

టీఆర్ఎస్ కు దక్కనున్న రెండు రాజ్యసభ సీట్లలో ఒక స్థానానికి కవిత పేరు దాదాపు ఫైనల్ అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో అన్ని రాజకీయ వర్గాలతో సత్సబంధాలు కలిగివుండటం... వాక్చాతుర్యం, హిందీ, ఇంగ్లీష్ మీద పట్టు ఉండటం.... తెలంగాణ సమస్యలు, అంశాల మీద సమగ్ర అవగాహన కలిగివున్న కవితను, రాజ్యసభకు పంపితే... హస్తినలో టీఆర్ఎస్ పాత్ర మరింత పెరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, కేసీఆర్ కూతురుగా ఉండే ఇమేజ్ ఎలాగూ ఉండనుంది. ఇలా, అన్నీ కవితకు కలిసొస్తున్నందున రాజ్యసభకు వెళ్లడం ఖాయమంటున్నారు.

ఇక, మిగిలిన మరో సీటుపైనే మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్లు గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇప్పటికే హమీ లభించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఖమ్మం ఎంపీ టికెట్ నిరాకరించినా..పొంగులేటి పార్టీకి విధేయులుగానే ఉన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ.. పార్టీ అభ్యర్ధుల విజయం కోసం పనిచేశారు. దీంతో అన్నా నువ్వు రాజ్యసభకు వెళుతున్నావు..రెడీ అవ్వు అని కేటీఆర్..పొంగులేటికి హమీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పెద్దల సభకు పొంగులేటి అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏదైనా, చివరి నిమిషంలో మార్పులు చేస్తే తప్ప, కవిత అండ్ పొంగులేటి రాజ్యసభకు వెళ్లడం ఖాయమంటున్నారు.