రహస్య స్నేహాలు బట్టబయలు

 

 

 

కాంగ్రెస్‌తో దోస్తీ లేనేలేదని తేల్చిచెప్పిన టీఆర్‌ఎస్... చాలాచోట్ల రహస్య స్నేహాలు మొదలుపెట్టేసింది. స్థానికంగా తమకు కావల్సిన చోట్ల ఎక్కడికక్కడ సర్దుబాట్లు చేసుకుంటోంది. కరీంనగర్ జిల్లా పరిస్థితి అలాగే కనిపిస్తోంది. రహస్య స్నేహాలన్నీ క్రమంగా బయటపడుతున్నాయి. జగిత్యాలలో ఆ పార్టీకి మద్దతుగా ఐదు చోట్ల పోటీకి దూరంగా ఉంది. వేములవాడలో ఏకంగా బీజేపీతో గులాబీయింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లిలో నాలుగు స్థానాల్లో పోటీ చేయుకుండా చేతులెత్తేసింది.

 

పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు మధ్య ఉన్న కోల్డ్‌వార్‌తో 19వ వార్డు నుంచి పోటీకి దిగిన పార్టీ అభ్యర్థి బండి సునీల్‌కు బీ ఫారం దక్కలేదు. సిరిసిల్లలోని 24వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు లేకుండా పోయూరు. వేములవాడ నగర పంచాయతీలో రెండు స్థానాల్లోనూ ఇదే పరిస్థితి. నిజానికి ఇక్కడ కమలనాథులతో టీఆర్ఎస్ రహస్య స్నేహం చేసింది. ఏడో వార్డు నుంచి నామినేషన్ వేసిన టీఆర్ఎస్ అభ్యర్థి, తన ప్రత్యర్థి అయిన బీజేపీ నాయకుడికి మద్దతుగా బరినుంచి తప్పుకొన్నాడు. అలాగే 11వ వార్డులో కూడా టీఆర్ఎస్ అసలు అభ్యర్థినే నిలబెట్టలేదు. అదీ కుమ్మక్కు రాజకీయం.