టీఆర్‌ఎస్‌ కి స్థలం కావాలి..మోడీకి స్వీట్ కావాలి

 

టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసు నిర్మాణానికి స్థలం కేటా యింపుపై వినతిపత్రాన్ని ఇచ్చారు. పార్లమెంటు లో టీఆర్‌ఎస్‌కు  ఉన్న 17 మంది సంఖ్యా బలం ఆధారంగా పట్టణాభివృద్ధి శాఖ నిబంధనల మేరకు తమకు వెయ్యి చదరపు గజాల స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని రాజేంద్ర ప్రసాద్‌ రోడ్‌ లో స్థలాన్ని కేటాయించాలని ప్రధానిని కోరారు. ముందుగా ఢిల్లీలోని సాకేత్, వసంత్‌ విహార్, దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ మార్గ్‌ ప్రాంత్రాలను టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్టీ ఆఫీసు నిర్మాణం కోసం పరిశీలించారు. ఇటీవల ఢిల్లీ పర్యటన ముగించుకొని వెళ్లే ముందు సీఎం కేసీఆర్‌ కూడా ఆయా ప్రాంతాల మ్యాపులను పరిశీలించి తెలంగాణ భవన్‌ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చివరికి అన్ని అనుకూలతలను పరిశీలించిన అనంతరం రాజేంద్ర ప్రసాద్‌ రోడ్‌ ను ఎంపిక చేసుకున్నారు. ఇదిలా ఉంటే తనను కలిసిన టీఆర్‌ఎస్‌ ఎంపీలతో  మోడీ సరదాగా సంభాషణ సాగించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అంత పెద్ద మెజారిటీతో గెలిచినా.. తనకు ఒక్క స్వీట్ కూడా తినిపించలేదన్నారు. మంత్రులు, ఎంపీలకు స్వీట్లు తినిపించి.. నాకు మాత్రం ఇవ్వరా? అని మోడీ అన్నారు. ప్రతిగా టీఆర్‌ఎస్‌ ఎంపీలు పుల్లారెడ్డి స్వీట్స్‌ నుంచి ప్రత్యేకంగా  బెల్లం, కాజుతో చేసే స్వీట్లను స్వయంగా తీసుకువచ్చి ఇస్తామని మోడీతో అన్నారు.