కొడంగల్‌ వెళ్ళింది వాస్తవమే - టీఆర్ఎస్ ఎంపీ

 

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గులాబీ దళంలో గుబులు పుట్టించారు.ఆ పార్టీ నుంచి ఇద్దరు లేదా ముగ్గురు ఎంపీలు కాంగ్రెస్ లో చేరుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.దీనిపై టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్‌ స్పందించారు.తాను కొడంగల్‌ వెళ్లిన మాట వాస్తవమేనని,రాష్ట్రంలో 26 లక్షల మంది లంబాడీలు ఉన్నారని, లంబాడీలు ఎక్కడ ఉన్నారో అక్కడ తాను ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు.ఆ ప్రచారంలో భాగంగానే కొడంగల్‌ కి కూడా వెళ్లానని,రేవంత్ రెడ్డి అన్నదాంట్లో నిజం లేదని స్పష్టంచేశారు. రేవంత్‌కు దమ్ము, ధైర్యం ఉంటే కాంగ్రెస్‌లోకి వెళ్లే ఎంపీల పేర్లను వెల్లడించాలని ఆయన సవాల్‌ విసిరారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. టీఆర్ఎస్ కోసం పనిచేసే వారిని ఆత్మరక్షణలో పడేసేలా మైండ్‌గేమ్స్ వద్దని ఆయన హితవు పలికారు.గతంలో కాకతీయ యూనివర్శిటీలో ఉద్యమంలో చురుగ్గా పాల్గొని విద్యార్థులకు అండగా నిలిచినట్లు గుర్తు చేశారు.అలాంటిది నేను పార్టీ వీడుతున్నట్లు వచ్చిన వార్తలు తనని బాధించాయని తెలిపారు.

మరోవైపు టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్టు వచ్చిన వార్తల్ని చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌ రెడ్డి కూడా ఖండించారు.ప్రగతిభవన్ లో తాజాగా మంత్రి కేటీఆర్ ని కలిసిన విశ్వేశ్వర్‌ రెడ్డి పార్టీ మారే ఆలోచనే తనకు లేదని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.