తెలంగాణ మంత్రులు కేవలం వారి నియోజక వర్గానికే పరిమితమా?

 

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ జరిగి పూర్తిస్థాయి క్యాబినెట్ కొలువుదీరింది. అన్ని శాఖలకు మంత్రులొచ్చారు. తమ శాఖలకు సంబంధించిన పనులు చూడాల్సిన బాధ్యత వీరిపై ఉంది. తమ శాఖలకు సంబంధించిన ఏ కార్యక్రమమైనా వీరు రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించే అవకాశం ఉంది. ఏ నియోజకవర్గానికి అయినా వెళ్లి పర్యటించే అధికారము ఉంది. అయితే కొందరు మంత్రుల మాత్రం తమ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారని చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఈ మంత్రులకు ఏమైంది ఎందుకు అన్ని జిల్లాల్లో పర్యటించటం లేదు, ఏవైనా కారణాలున్నాయా అనే చర్చ జరుగుతోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరు వల్లే కొందరు మంత్రులు ఇతర నియోజక వర్గాలకు వెళ్లడం లేదని తెలుస్తోంది. 

మొన్న ఈ మధ్య ఉమ్మడి పాలమూరుకు చెందిన ఓ మంత్రి పక్కనే ఉన్న నియోజకవర్గానికి తరచూ వెళుతున్నారట. మంత్రి రాకను జీర్ణించుకోలేని ఆ ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేశారట. తన కోపాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు గన్ మెన్లను వెనక్కి పంపించారట. అంతే కాకుండా పార్టీ నేతలకు అందుబాటులోకి రాకుండా అలకపాన్పు ఎక్కారట. దీంతో ఆ జిల్లా మంత్రి అటువైపు వెళ్లడం మానేశారు అని తెలుస్తోంది. 

ఇక హైదరాబాద్ కు చెందిన మంత్రుల పరిస్థితి కూడా అలాగే ఉంది. మేడ్చల్ జిల్లాకు చెందిన మంత్రి తన కొడుకు, అల్లుడు భవిష్యత్ కోసం సిటీలోని నియోజక వర్గాల్లో జోరుగా టూర్లు వేస్తున్నారు. దీంతో లోకల్ ఎమ్మెల్యేలు మంత్రి గారి పర్యటనలకు బ్రేకులు వేశారట. దీంతో ఆ మంత్రి కూడా తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఆయన కూడా తన సర్కిల్ దాటడం లేదట. 

సికింద్రాబాద్ మంత్రిగా పేరు పొందిన నేత కూడా వేరే జిల్లాల్లో పర్యటన చేస్తున్నారు. కానీ సిటీలో మాత్రం వేరే నియోజక వర్గాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. మాజీ మంత్రి మేయర్ తో వచ్చిన గ్యాప్ వల్లే ఆయన సిటీకి దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ మంత్రి పరిస్థితి కూడా అలానే ఉంది. తన జిల్లా తన నియోజక వర్గం తప్ప ఎటూ వెళ్లట్లేదంట. 

ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల, ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు, పురపాలికశాఖ మంత్రి కేటీఆర్ మినహా మిగతా మంత్రులెవరూ కూడా వేరే జిల్లాలో అడుగుపెట్టడానికి సాహసం చేయడం లేదట. సాధారణంగా మంత్రి హోదాలో రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించే అధికారాలు మంత్రులకుంటాయి. కానీ ఎమ్మెల్యేల నుండి సహకారం లేకపోవటం తమ టూర్ లతో వారు అసంతృప్తికి గురి కావడంతో మనకు వచ్చిన తంటా ఎందుకులే అని కొందరు మంత్రులు తమ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారట.