తెరాస ప్రచారానికి అడ్డంకులు

 

ఓ వైపు తెరాస అధినేత కేసీఆర్‌ రానున్న ఎన్నికల్లో 100 కి పైగా సీట్లు గెలుస్తామని బహిరంగ సభల్లో వెల్లడిస్తుంటే మరో వైపు తమ నియోజక వర్గాల్లో ప్రచారానికి వెళ్లిన నేతలకు చేదు అనుభవం ఎదురవుతుంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన హుస్నాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత వొడితెల సతీశ్ కుమార్ ని కాంగ్రెస్ కార్యకర్తలు,స్థానికులు అడ్డుకొని నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని, తమ గ్రామాన్ని అనవసరంగా అక్కన్నపేట మండలంలో కలిపారని వొడితెలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డు పై బయటయించి నిరసన తెలుపగా వారిని బూటు కాలుతో తన్నుకుంటూ వెళ్లి వివాదంలో చిక్కుకున్న సంగతి మరవకముందే మరో ఇద్దరు తెరాస ప్రజాప్రతినిధులకు ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది.ఖమ్మం జిల్లా చీమలపాడులో ప్రచారానికి వెళ్లిన వైరా తాజా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌కు రైతుల నుంచి నిరసన వ్యక్తమైంది.‘‘మాపై అటవీ సిబ్బంది దౌర్జన్యాలు కొనసాగుతుంటే.. మీరు ఏమైనా చేశారా? ఇప్పుడు మీకు మేం ఎందుకు ఓట్లేయాలి?’ అంటూ ఆయనను పోడు రైతులు నిలదీశారు.అలానే ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ తాజా మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు ప్రచారంలో భాగంగా తలమడుగు మండలం కుచ్లాపూర్‌ వెళ్లగా చెరువు నిర్మిస్తామని ప్రతి ఎన్నికల్లో హామీ ఇస్తున్నారే తప్ప అమలుచేయడం లేదని గ్రామస్తులు ఆయనను నిలదీశారు. సీసీ రోడ్ల నిర్మాణానికి కొబ్బరికాయలు కొట్టి మూడేళ్లయినా ముందుకుసాగడం లేదని, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు,దళితులకు మూడెకరాల భూ పంపిణీ ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజల నుంచి ప్రశ్నల పరంపరను తట్టుకోలేక బాపూరావు.. తీవ్ర అసహనానికి గురయ్యారు. ‘మళ్లీ మీ ఊరికి ఎన్నికల ప్రచారానికి రాను’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.