డబ్బులు తీసుకొని ఓటేశారుగా.. నీళ్లు రావు పోండి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే

ఎన్నికల సమయంలో.. మాకు ఏం చేస్తారు? బదులు, మాకు ఎంత ఇస్తారు? అని ఓటర్లు నాయకులను అడుగుతారు. తీరా ఎన్నికలు ముగిశాక.. మాకు అది చేయండి, ఇది చేయండని.. నాయకుల వెంట పడితే.. 'అప్పుడు డబ్బులు తీసుకొని ఓటేసారుగా, అనుభవించండి' అని సింపుల్ గా ఒక డైలాగ్ కొడతారు. దీంతో ఓటర్లు తెల్లమొహాలు వేస్తారు. తాజాగా తెలంగాణలో అలాంటి సంఘటనే జరిగింది. ‘‘సర్పంచ్‌ ఎన్నికల్లో డబ్బు తీసుకోకుండా ఓటేశారా?.. డబ్బులు తీసుకుని తప్పు చేశారు.. పంటలకు నీళ్లు రావు పోండి’’ అంటూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. నీళ్లు ఇవ్వమని కోరిన రైతులను ఉద్దేశించి అన్నారు. 

సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో బుధవారం ఎంపీపీ కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులతో పాటు, పట్ట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. కూటిగల్‌ నల్ల చెరువులో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, చెరువును నీటితో నింపాలని.. కొండాపూర్‌కు చెందిన పలువురు రైతులు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. దీంతో ఎమ్మెల్యే రైతులపై మండిపడ్డారు. సర్పంచ్‌ ఎన్నికల్లో డబ్బులు తీసుకుని తప్పు చేశారు.. తప్పు ఒప్పుకొంటే రెండు పంటలకు నీళ్లు ఇస్తానని అన్నారు. తప్పులు చేయకుండా బతకాలని హితవు పలికారు. కలెక్టరు, మంత్రి స్థాయిలో కొట్లాడి.. ఏడాదికి రెండు పంటలకు నీళ్లందేలా చూస్తానని ఎమ్మెల్యే తెలిపారు.