ఆర్టీసీ సమ్మె ప్రభావం.. హుజార్ నగర్ పై ఆశలు వదులుకున్న టీఆర్ఎస్!!

 

ఆర్టీసీ సమ్మెతో టీఆర్ఎస్ కు గట్టి షాక్ తగలనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటికి మొన్న ఉపఎన్నికల్లో మొదట టీఆర్ఎస్ కు మద్దతిచ్చిన సిపిఐ ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ మద్దత్తును వెనక్కు తీసుకుంది. మరోవైపు.. కార్మికులతో చర్చలు జరపకుండా మొండిగా వ్యవహరించడంతో టిఆర్ఎస్ పై వ్యతిరేకత పెరుగుతోందని స్థానిక నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమ్మె పై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకింత మొండిగా ఉందని సకల జనులు సమ్మె చేయకుండానే తెలంగాణ వచ్చిందా అని స్థానిక ప్రజలు తమని నిలదీస్తున్నారనీ ప్రచారంలో ఉన్న నేతలు చెప్తున్నారు. సమ్మె ప్రభావం లేదని బయటకు ఎంత చెబుతున్నా గ్రౌండ్ లెవల్ లో మాత్రం వ్యతిరేకత తెలుస్తుందంటున్నారు గులాబీ నేతలు. 

ఆర్టీసీ సమ్మెకు ఉద్యోగ సంఘాలు మద్దతివ్వడం, అధికార పార్టీని మరింత కలవరపెడుతోంది. దీనికితోడు కేసీఆర్, కేటీఆర్ ప్రచారానికి రాకపోవడం కూడా ఫలితంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని అంటున్నారు.ఈ నెల నాలుగు, పది, పదకొండు, పదిహేను తేదీల్లో కేటీఆర్ ప్రచార సభలు, రోడ్ షోలుంటాయని పార్టీ ప్రకటించింది. కానీ, నాలుగో తేదీ న హుజూర్ నగర్ టౌన్ లో రోడ్ షో నిర్వహించిన కేటీఆర్ తిరిగి మళ్ళీ అటు వైపు చూడలేదు. ఇక వర్షం కారణంగా కేసీఆర్ సభ కూడా రద్దయింది. ఉప ఎన్నిక ప్రచారం రేపు సాయంత్రం ఐదు గంటలతో ముగియనుండగా కేటీఆర్ ప్రచారానికి రాకపోవటం, సీఎం సభ రద్దు కావడం అధికార పార్టీ కేడర్ ను కలవరపెడుతోంది. సీఎం సభలో పాల్గొని మాట్లాడితే కొంతలో కొంత కలిసి వచ్చేదని ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదని టీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. మొత్తానికి సమ్మె సెగ హుజుర్ నగర్ లో టీఆర్ఎస్ కు తాకేలా ఉందని అంటున్నారు.