అధిష్టానం మరియు ఆర్టీసీ కార్మికుల మధ్య నలిగిపోతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు...

 

ఆర్టీసీ కార్మికుల సమ్మె అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. కార్మికులను సమ్మె నుంచి విరమింపజేసి విధుల్లో చేర్చడం ఇబ్బందిగా మారింది. అటు కార్మికులను ఒప్పించ లేక ఇటు పార్టీ అధిష్టానం ఆదేశాలను కాదనలేక నేతలు సతమతమవుతున్నారు. డిపోల స్థాయిలో కొన్ని కార్మిక సంఘాల నేతలతో ఫోన్ లో మంతనాలు జరిపిన ఎమ్మెల్యేలు హైకమాండ్ నుంచి కాల్స్ రావడంతో టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకు ఉధృతమవుతోంది. తమ డిమాండ్ లను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతుందని ప్రకటించింది జెఎసి. డిపోల ముందు నిరసనలు, ర్యాలీలు, మానవహారాలు, కలెక్టరేట్ల ముట్టడి, వంటా వార్పులతో సమ్మెను కొనసాగిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రవాణానూ మెరుగుపరిచామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు.

కార్మికులు ఎవరైనా డ్యూటీలో చేరాలనుకుంటే డిపోలో అప్లికేషన్ పెట్టుకోవాలని ఇప్పటికే ప్రకటించారు సీఎం కేసీఆర్. దీంతో కార్మికులు డ్యూటీలకు వస్తారని ప్రభుత్వం భావించింది. కానీ కార్మికులు నుంచి స్పందన రాలేదు. దీంతో కార్మికులతో సమ్మె విరమింపజేసి విధుల్లో చేర్పించే బాధ్యతను ముఖ్య నేతలు ఎమ్మెల్యేలకు సీఎం అప్పగించినట్లు తెలుస్తోంది. అధినేత సూచనలతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యేలు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. అయితే కార్మికులు సంఘాల నేతల నుంచి అనుకున్నంత రెస్పాన్స్ రాకపోవడంతో ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నాలూ విఫలమయ్యాయి. దీంతో అటు అధిష్టానం ఒత్తిడిని తట్టుకోలేక ఇటు కార్మికులను విధుల్లోకి చేర్పించలేక ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది.

సీఎం చెప్పిన ఎమ్మెల్యేలు మంతనాలు జరిపినా ఇప్పటి వరకు రాష్ట్రం లోని ఏ డిపోలో కూడా కార్మికులు విధుల్లో చేరక పోవడం పై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఎలాగైనా కార్మికులను విధుల్లో చేర్చాలని ఎమ్మెల్యేలపై పార్టీ ముఖ్య నేతలు ఒత్తిడి పెంచుతున్నట్టు తెలుస్తోంది. కార్మిక సంఘాల నేతలతో ఫోన్ లో మాట్లాడితే రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తారేమోనన్న భయం ఎమ్మెల్యేలను వెంటాడుతోంది. దీంతో కార్మికులతో ఫోన్ లో మాట్లాడేందుకు జంకుతున్నట్లు సమాచారం. కార్మిక సంఘాల నేతలను నేరుగా కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నా వారు అంగీకరించటం లేదని టాక్.

ఆర్టీసీ సమ్మెతో తమ నియోజకవర్గాల్లో తిరగలేని పరిస్థితులున్నాయని కొందరు ఎమ్మెల్యేలు అనుచరుల దగ్గర చెప్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులు నిరసన కార్యక్రమాలు చేస్తుండటంతో తమను ఎక్కడ అడ్డుకుంటారోనని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నట్లు చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల్లో ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల లాంటి అధికారిక కార్యక్రమాలను సైతం వాయిదా వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని కొందరు ఎమ్మెల్యేలు తమ జిల్లా మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా పార్టీ అధిష్టానంతో విషయం చెప్పేందుకు జంకుతున్నట్లు చర్చ జరుగుతోంది.