వంటేరు, పరిపూర్ణానందపై ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్

 

కాంగ్రెస్‌ నేత వంటేరు ప్రతాప్‌ రెడ్డి, బీజేపీ నేత, శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానందపై టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. వంటేరు ప్రతాప్ రెడ్డి రీసెంట్ గా టీఆర్ఎస్ నేత హరీష్ రావు మీద సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ నెంబర్ నుంచి హరీష్ రావు తనకి కాల్ చేసి.. కేసీఆర్ ని ఓడించాలని చెప్పినట్టు తెలిపారు. అంతేకాదు హరీష్ రావు రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారని.. త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా నల్గొండలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పరిపూర్ణానంద ఒక్కొక్కరికి రూ.200 ఇస్తే వేల ఓట్లు పడుతాయని ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విధంగా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. హరీశ్‌రావుపై ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదన్నారు. ఫిర్యాదుతో పాటు ప్రతాప్‌రెడ్డి వ్యాఖ్యల వీడియోనూ రజత్‌కుమార్‌కు అందజేసినట్టు తెలిపారు. అలాగే, స్వామి పరిపూర్ణానంద తమపై చేసిన వ్యాఖ్యలపైనా చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు.