హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డి అందుకోసమే వెళ్ళారా..?

 

చూడబోతే చుట్టాలూ రమ్మంటే కోపాలు అన్న సామెతను తలపించేలా ఉందట హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డికి అందిన ఆహ్వానం వ్యవహారం. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు వర్గాలు ఆధిపత్య పోరు మామూలే అన్నట్టుగా ఉంటుంది, సొంత పార్టీ నేతలే ఒకరి మీద మరొకరు నేరుగానే విమర్శ చేసుకుంటారు. బహిరంగ వేదికల మీదే తిట్టిపోస్కుంటారు. మామూలుగా అయితే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటారు. అదేమంటే పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువంటారు, ఎవరు ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ తమ పార్టీలో ఉంటుందని చెబుతారు. కాంగ్రెస్ లోని ఈ బలహీనతలే ఎదుటి పార్టీకి బలంగా చెప్తారు. ఎన్నికల్లోనూ వారిని వారే ఓడించి కుంటారని అపవాదుంది కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్లేమో గాని హస్తం పార్టీ నేతల వైఖరిలో మార్పు కనిపిస్తోంది. అయితే కలహాల విషయంలో రాజీ అవ్వకపోయినా ఎన్నికలొస్తే మాత్రం కలిసి పని చెయ్యడానికి రెడీ అవుతున్నారు.


హుజూర్ నగర్ ఉప ఎన్నిక వేళ హస్తం పార్టీ నేతలు తమ మధ్య విభేదాలను పక్కన బెట్టి ఐక్యతను ప్రదర్శిస్తూ ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ నేతలు హుజూర్ నగర్ కు తరలివెళ్లారు, వారు మండలాల వారీగా మోహరించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ప్రచార వ్యూహాలను అమలు చేస్తున్నారు, అధికార టీ.ఆర్.ఎస్ కు ధీటుగా కాంగ్రెస్ శ్రేణులను రంగంలోకి దింపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార ప్రతి నిధులు తమ బలగంతో వెళ్ళి పల్లెపల్లెనా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తమ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి తామే దక్కించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. విభేదాలు పక్కన పెట్టి కలిసి ప్రచారాన్ని సాగిస్తున్నారు, ఇక తన సొంత నియోజక వర్గం కావడం ఆయన సతీమణి పోటీలో ఉండడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.


నేతలందరినీ ఆయనే సమన్వయం చేస్తున్నారు, ఇంత వరకు బాగానే ఉన్నా హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి రేవంత్ రెడ్డి వెళ్తారా లేదా అన్న చర్చ పార్టీలో జోరుగా జరిగింది. ఆయన ప్రచారానికి వెళ్లకపోవచ్చని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అందుకు కారణాలు కూడా ఉన్నాయి హుజూర్ నగర్ అభ్యర్థుల ఎంపిక విషయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత పరిణామాలు పార్టీలో పెద్ద దుమారమే రేపాయి. ఏకంగా ఉత్తమ్ ను టార్గెట్ చేయడంతో పార్టీలోని సీనియర్లంతా ఏకమయ్యారు. రేవంత్ రెడ్డి మీద మాటల దాడి చేశారు, దీంతో పార్టీలో సీన్ ఉత్తమ్ వర్సెస్ రేవంత్ గా మారిపోయింది. పీసీసీ చీఫ్ కు షోకాజ్ నోటీసు ఇవ్వాలన్న రేవంత్ వ్యవహారంపై ఉత్తమ్ కూడా గుర్రుగా ఉన్నట్టు పార్టీలో ప్రచారం జరిగింది.


ఈ పరిణామాల నేపథ్యంలోనే హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి రేవంత్ వెళ్తారా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. తన సొంత నియోజకవర్గంలో ప్రచారానికి రేవంత్ ను ఉత్తమ్ ఆహ్వానిస్తారా అనే సందేహాలు కూడా తలెత్తాయ్. దీనిపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతుండగానే రేవంతరెడ్డి ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల పధ్ధెనిమిది, పంతొమ్మిది తేదీల్లో ఆయన ప్రచారం చేసేందుకు రెడీ అయ్యారట. మొత్తమ్మీద హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రచారంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అభ్యర్థి ఎంపిక విషయంలో ఉత్తమ్, రేవంత్ మధ్య గ్యాప్ ఏర్పడడం ఒకరినొకరు పలకరించుకోకుండా ఉండటం వంటివి జరిగాయి.
ఈ నేపధ్యంలో ఇప్పుడు హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారం విషయమై ఎవరు మెట్టుదిగారు, రేవంత్ రెడ్డిని హుజూరునగర్ ప్రచారానికి ఎవరైనా ఆహ్వానించారా లేక ఆయనే వెళుతున్నారా అనే విషయంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. నేతలు స్వచ్ఛందంగా వెళ్లి ప్రచారం చేస్తున్నారని అలాగే రేవంత్ రెడ్డి కూడా వెళుతున్నారని ఉత్తమ్ వర్గం చెబుతోంది.

అయితే యూత్ లో రేవంత్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఉత్తమ్ పద్మావతిని స్వయంగా ఇంటికెళ్లి ఆయన ప్రచారానికి రావాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఇంటికొచ్చి మరీ ఆహ్వానించడంతో రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్ళాలని అనుకున్నట్లు చెబుతున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్ నేతల మధ్య వచ్చిన యూనిటీ ఆ తరవాత కూడా అలానే ఉంటుందో లేదో చూడాలి .