తెరాస బీజేపీవైపు చూస్తోందా?

 

తెదేపా-బీజేపీ, కాంగ్రెస్-తెరాసల మధ్య ఎన్నికల పొత్తుల విషయం ఇంకా నలుగుతూనే ఉంది. అయితే తెదేపా-బీజేపీలు సానుకూల వాతావరణంలో పొత్తులు కుదుర్చుకొనే దిశలో ముదుకు కదులుతుంటే, కాంగ్రెస్-తెరాసలు మాత్రం ఇంకా తమ టామ్ & జెర్రీ షో కొనసాగిస్తూ ప్రజలకు వినోదం కలిగిస్తూనే ఉన్నాయి. తెదేపా-బీజేపీ పొత్తుల సంగతి తేలిపోతే దానిని బట్టి ఏదోఒక నిర్ణయం తీసుకోవచ్చని తెరాస భావించడమే అందుకు ప్రధాన కారణమయి ఉండవచ్చును. ఒకవేళ ఆ రెండు పార్టీల మధ్య పొత్తులు కుదరకపోయినట్లయితే, అప్పుడు తామే బీజేపీతో పొత్తులు పెట్టుకోవచ్చునని తెరాస ఎదురుచూస్తోందేమో. లేదా ఒకవేళ ఆ రెండు పార్టీలు పొత్తులు కుదుర్చుకోలేకపోయినట్లయితే ఆ కారణంగా తెలంగాణాలో బలహీనంగా మారే ఆ రెండు పార్టీలను తేలికగా ఎదుర్కోవచ్చనే భ్రమలో ఉండి ఉండవచ్చును.

 

అదే తెరాస ఆలోచనయితే అది వాపును చూసి బలుపు అని భ్రమస్తున్నట్లే అవుతుంది. ఎందువలన అంటే తెరాసకు కేవలం నాలుగయిదు జిల్లాలపైనే మంచి పట్టు ఉంది. మిగిలిన జిల్లాలలో కొన్ని చోట్ల తెదేపా, కాంగ్రెస్ పార్టీలు మరికొన్ని చోట్ల బీజేపీ, లెఫ్ట్ పార్టీలు, ఇంకొన్ని చోట్ల వైకాపా బలంగా ఉన్నాయి. తెరాస ఇంతవరకు తెలంగాణా సెంటిమెంటుపైనే ఆధారపడి నడుస్తోంది తప్ప గ్రామస్థాయి వరకు పార్టీ నిర్మించుకోలేదు. అందుకే గత ఏడాది జరిగిన సహకార, పంచాయితీ ఎన్నికలలో తెరాస చతికిలబడితే, గ్రామస్థాయి వరకు పార్టీని నిర్మిచుకొన్న కాంగ్రెస్,తెదేపాలు విజయకేతనం ఎగురవేసాయి.

 

అంతేగాక తెరాసలో యంపీ స్థానాలకు పోటీ చేయగల సత్తా, ఆర్ధిక, అంగ బలం గల నేతలు ఎక్కువమంది లేరు. అందువల్ల తెరాస దురాశాకుపోయి కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకోకపోతే రెండు పార్టీలు నష్టపోక తప్పదు. ఒకవేళ కాంగ్రెస్ తో పొత్తులు ఇష్టం లేకపోతే కనీసం బీజేపీతో అయినా పొత్తులు పెట్టుకోవడం ఆ పార్టీకి అన్ని విధాల శ్రేయస్కరం. లేకుంటే, కాంగ్రెస్, తెదేపా, బీజేపీ, ఓయూ విద్యార్ధులు, స్వతంత్ర అభ్యర్ధులతో జరిగే ఈ పోటీలో సర్వేలు చెపుతున్నట్లుగా తెరాస తిరుగులేని మెజార్టీ సాధించడం అసంభవం అవుతుంది.

 

ఈసారి ఎన్నికలలో తెరాస పూర్తి విజయం సాధించలేక చతికిల పడినట్లయితే,దాని ప్రాభవం కోల్పోయి విధిలేని పరిస్థితుల్లో సిగ్గువిడిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో విలీనానికి సిద్దపడవలసి వస్తుంది. అందువల్ల తెరాస తనను తాను మరీ ఎక్కువగా ఊహించుకొని కాంగ్రెస్ ను దూరం చేసుకొంటే దానికే నష్టం.