ఆంధ్ర మంత్రం జపిస్తున్న తెరాస ప్రభుత్వం

 

తెరాస నేతలు తాము కోరుకోన్నట్లుగానే తెలంగాణా రాష్ట్ర అధికార పగ్గాలు చెప్పట్టినా ‘సర్వరోగ నివారిణి-ఆంద్ర మంత్రం’ పటించే అలవాటు మాత్రం వదులుకోలేకపోతున్నారు. వ్యవసాయ రుణాలమాఫిపై ప్రతిపక్షాలు చేస్తున్న లొల్లిచూసి కలతచెందిన తెలంగాణా రాష్ట్ర ఆర్దికమంత్రి ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, తాము అధికారం చేప్పట్టి ఇంకా నాలుగు రోజులు కూడా కాకుండానే, ఆంధ్రా పార్టీలు, ఆంధ్రా మీడియా అప్పుడే తమపై బురద జల్లడం మొదలుపెట్టాయని, కొన్ని ఆంద్ర శక్తులు తెలంగాణా రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని, రైతులు వారి మాటలు నమ్మవద్దని, రుణమాఫీ విషయంలో రైతుల కేవలం ప్రభుత్వం ఏమి చెపుతోందో దానినే పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు. మరొక వారం పదిరోజుల్లో రుణమాఫీలపై ప్రభుత్వం ఖచ్చితమయిన నిర్ణయం ప్రకటిస్తుందని అంతవరకు రైతులు ఓపికపట్టాలని ఆయన కోరారు.

 

నిజానికి వ్యవసాయ రుణాలమాఫీపై మొట్టమొదట ఆయనే స్వయంగా ప్రకటన చేసారు. రైతులు 2013-14 సం.లలో తీసుకొన్న లక్ష లోపు వ్యవసాయ రుణాలను మాత్రమే ప్రభుత్వం మాఫీ చేస్తుందని, (అంటే అంతకు ముందు సం.లలో తీసుకొన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేయలేమని అర్ధం), రైతులు బంగారం కుదువ పెట్టి తీసుకొన్న వ్యవసాయ రుణాలకు ఈ మాఫీ వర్తించదని ఆయనే స్వయంగా ప్రకటించారు.

 

అప్పటి నుండే ప్రతిపక్షాలు తెరాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టాయి. వారి కంటే ముందు తెరాస కార్యకర్తలే తమ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ కొన్ని గ్రామాలలో పార్టీ జెండా దిమ్మలు కూలద్రోసినట్లు వార్తలు వచ్చాయి. స్వయంగా తమ పార్టీ కార్యకర్తలే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తున్నపుడు, ఈ వ్యవహారంలో ఆంధ్రా శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఈటెల ఆరోపించడం ఆశ్చర్యకరమే.

 

తెరాస నేతలు ఉద్యమాలు చేస్తునంత కాలం తెలంగాణా ప్రజలను తమవైపు తిప్పుకోవడానికి నిత్యం ‘ఆంద్ర మంత్రం’ పటించడం సహజమే అనుకొన్నప్పటికీ, ఇప్పుడు అధికారం చేప్పట్టిన తరువాత కూడా తమ సమస్యల నుండి బయటపడటానికి ‘ఆంద్ర మంత్రం’ పటించడం చూస్తే, తెరాస నేతలు దానినే సర్వరోగ నివారిణిగా భావిస్తున్నట్లు కనబడుతోంది. ఇదే నిజమయితే బహుశః రానున్న ఐదేళ్ళు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఈ ఆంధ్ర మంత్రాన్నిఅధికారిక మంత్రంగా చేసుకొని నిత్యం జపించవచ్చును.

 

ఉద్యోగులకు ఆప్షన్స్ ఉండవని తేల్చి చెప్పిన తెరాస ప్రభుత్వం ఈ ‘ఆంధ్రా ఆప్షన్’ ఉంచుకొన్నప్పటికీ, ఆంద్రప్రదేశ్లో అధికారంలోకి వస్తున్న తెదేపా ప్రభుత్వానికి మాత్రం ఇటువంటి ఆప్షన్ (వెసులుబాటు) లేదు. కానీ మిగులు బడ్జెట్ ఉన్న తెరాస ప్రభుత్వమే రుణమాఫీలు అమలు చేయలేనప్పుడు, లోటు బడ్జెట్ ఉన్న తామేవిధంగా అమలు చేయగలమని రైతులకు సర్దిచెపే ప్రయత్నం చేసుకొనే ఆప్షన్ మాత్రం ఉంది.