తెరాస తొలి జాబితా విడుదల నేడే

 

కాంగ్రెస్ పార్టీ తెరాసతో ఎన్నికల పొత్తుల కోసం చకోర పక్షిలా ఆశగా, బేలగా చూస్తూ నేటికీ తమ తలుపులు తెరిచియేయున్నవి అని చెపుతుంటే, నక్షత్రకుడిలా తనవెంట బడుతున్న కాంగ్రెస్ పార్టీని వదిలించుకోలేక తెరాస తిప్పలు పడుతోంది. అయితే తెదేపా-బీజేపీల పొత్తుల సీరియల్లో బ్రేక్ వస్తే బీజేపీతో కలిసి ఆడిపాడుకొందామనుకొన్న తెరాస నేత కేసీఆర్ కు ఎంతకీ ఆ బ్రేక్ రాకపోవడంతో ఈరోజు తన పార్టీ అభ్యర్ధుల మొదటి జాబితాను విడుదల చేసేందుకు సిద్దమయిపోతున్నారు. బహుశః బీజేపీ తెదేపాకే కమిట్ అయిపోయిందని ఆయనకు డిల్లీ నుండి హాట్ లైన్లో కబురు వచ్చెందేమో కూడా!

 

ఈరోజు మొత్తం 69మంది శాసనసభ అభ్యర్ధుల పేర్లతో కూడిన జాబితాను విడుదల చేయబోతున్నారు. దీనితో ఇక తెరాస కటీఫ్ చెప్పేసినట్లే అవుతుంది గనుక, కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్ధులను వెంటనే ప్రకటించేయవచ్చును. కాంగ్రెస్, తెరాసలు తమ అభ్యర్ధుల పేర్లను ప్రకటించగానే, సహజంగానే తెదేపా, బీజేపీలపై మరింత ఒత్తిడి పెరుగుతుంది గనుక అవి కూడా తమ పొత్తుల ధారావాహికాన్ని తక్షణం ముగించి తమ అబ్యార్ధులను ప్రకటిస్తే, ఇక అన్ని పార్టీ అభ్యర్ధులు పార్టీ జెండాలు, మైలుకు పట్టుకొని ఊర్లమీద పడతారు.