తెరాసను చూసి జడుసుకొంటున్న టీ-కాంగ్రెస్ నేతలు

 

ఊహించినట్లుగానే కేసీఆర్ ‘హస్తం’ పార్టీకి హ్యాండిచ్చి విలీనం బాధ నుండి బయటపడ్డారు. ఆయన కావాలనుకొంటే పొత్తులు కూడా ఉండవని నిన్ననే ప్రకటించి ఉండవచ్చును. కానీ ప్రకటించలేదు. కాగల కార్యం గంధర్వులే చేస్తారన్నట్లుగా, నేటి నుండి కాంగ్రెస్ నేతలందరూ కేసీఆర్, తెరాసను లక్ష్యం చేసుకొని దాడికి దిగి ఇక తెరాసతో పొత్తులు అవసరం లేదని వారే చెపుతారు గనుక ఆయన ఆశ్రమ తీసుకోలేదు. కేసీఆర్ ఆడిన మాట తప్పి మోసం చేసారని, తెరాస విలీనం కాకపోయినా కాంగ్రెస్ కు వచ్చే నష్టం ఏమీ లేదని, తెలంగాణా ఇచ్చినందుకు ప్రజలందరూ తమ వెంటే ఉంటారని కాంగ్రెస్ నేతలందరూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించవచ్చు గాక, కానీ తెరాస విలీనం కాలేదనే వారి ఆక్రోశమే వారు తెరాసను చూసి ఎంత భయపడుతున్నారో అద్దం పడుతోంది. టీ-కాంగ్రెస్ నేతల సామర్ధ్యాన్ని ఎవరూ తక్కువగా అంచనా వేయకపోయినప్పటికీ, తెరాస విలీనం గురించి పదేపదే మాట్లాడుతూ తమ సామర్ధ్యంపై తమకే నమ్మకం లేనట్లుగా చాటుకొంటున్నారు.