విలీనం కాకపోతే తెరాస ఖాళీ అయిపోతుందా

 

తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలా వద్దా? చేస్తే లాభమా నష్టమా? అయితే ఎంత శాతం? అని కేసీఆర్ మదనపడుతుంటే, మరో వైపు దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలనే జ్ఞానం పొందిన తెరాస నేతలు కొందరు డిల్లీలో కాంగ్రెస్ కార్యాలయం ముందు క్యూలు కడుతున్నారు.

 

మొన్నరాములమ్మ డిల్లీ వెళ్లి దిగ్గీరాజాకు రాఖీ కట్టి రావడంతో అగ్గి మీద గుగ్గిలమయిపోయిన కేసీఆర్, తన ముద్దుల చెల్లెమ్మని కూడా ఆలోచించకుండా వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసేసాడు. అయితే, ఆమె వెనుక మరో నలుగురైదుగురు కూడా క్యూలో నిలబడిన సంగతి తెలిసిన తరువాత ఇప్పుడు వారి నందరినీ కూడా సస్పెండ్ చెయాలా వద్దా? చేస్తే ఇక పార్టీలో తన కుటుంబ సభ్యులు తప్ప మరేవరయినా మిగులుతారా? అనే భయం కేసీఆర్ కి పుట్టుకొచ్చింది.

 

రాములమ్మ తరువాత తాజాగా డిగ్గీ రాజాకు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టేందుకు తెరాస నేతలు ఏ. చంద్రశేఖర్, విజయరామారావు, ఓ. చందులాల్‌లు, సోయం బాబు రావు, దిలీప్ తదితరులు డిల్లీలో ఎదురుచూస్తున్నారు.

 

కానీ, బేరం కుదిరితే ఇవాళ్ళోరేపో తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనం ఖాయమని వార్తలు వస్తున్న తరుణంలోకూడా తెరాస నేతలు, అంత కంటే ముందుగానే తమ టైటానిక్ నావలోంచి కాంగ్రెస్ నావలోకి దూకేయాలను కోవడం వారి ముందు చూపుకి నిదర్శనం.

 

ఒకవేళ వారు తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యే వరకు కూర్చుంటే, విలీనం తరువాత టికెట్ల కేటాయింపు వ్యవహారం మొత్తం కాంగ్రెస్ అధిష్టానం చేతిలోకే వెళ్ళిపోతుంది. అప్పుడు కేసీఆర్ ముందుగా తన ఇంట్లో వాళ్ళకి, ఆ తరువాత బాగా కావలసిన వారికే టికెట్స్ ఇప్పించుకొంటాడు గానీ, తెరాసలో ఉన్న అందరికీ ఇప్పించడు. ఒకవేళ అలా అడిగినా కాంగ్రెస్ తన పార్టీ నేతలని కాదని వారికి ఇవ్వదు. ఇవ్వదలుచుకొన్నా కాంగ్రెస్ లో ఉన్న నేతలు అడ్డుపడటం ఖాయం. అందుకే వారందరూ ముందుగానే వెళ్లి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ పట్టుకొని మన దిగ్గీరాజ ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నారు.

 

ఇక మరో కారణం ఏమిటంటే, ఒకవేళ బేరం కుదరక కేసీఆర్ తెరాసను నడుపుకోదలిస్తే, అప్పుడు వారు ఆయన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడక తప్పదు. ఎలాగో కష్టపడి టికెట్ సంపాదించుకొన్నా, తెలంగాణా ఇచ్చిన ఊపు మీద ఉన్న బలమయిన కాంగ్రెస్ నేతలతో వారు పోటీ పడిగెలవడం చాలా కష్టం. ఇక, ఒకవేళ కష్టపడి ఎలాగో కొందరు గెలిచినా, తెరాస భారీ మెజార్టీతో గెలిచి మొట్ట మొదటిసారిగా ఏర్పడబోతున్నతెలంగాణా ప్రభుత్వంలో అధికారం దక్కించుకోగలదని నమ్మకం లేదు.

 

కొత్త ప్రభుత్వంలో తప్పని సరిగా జేరాలని అందరికీ ఆరాటం ఉంటుంది. ఆ ఆరాటం ఉన్నవారి మధ్య తీవ్రమయిన పోటీ కూడా ఉంటుంది. అందుకే దీపం ఉండగానే తమ టికెట్స్ రిజర్వ్ చేసుకోవాలనే ప్రయత్నంలో తెరాస నేతలు డిల్లీలో దిగ్గీ రాజ ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

 

ఇదంతా చూస్తున్న పార్టీలో మిగిలిన నేతలు విలీనం సంగతి త్వరగా తేల్చకపోతే, మా పరిస్థితి టైటానిక్ షిప్పులో పయనిస్తున్నట్లే ఉంది అంటూ ఆందోళనగా గంట కొడుతున్నారు. మరి కెప్టెన్ కేసీఆర్ వారిని కాంగ్రెస్ నావలోకి ఎక్కనిస్తాడో లేక మధ్యలోనే ముంచేస్తాడో చూడాలి.