రావణ దహనం.. పెను విషాదం.. 60 మంది దుర్మరణం

 

ఏ రోజు చివరిదో.. ఏ నిమిషం చివరిదో చెప్పలేం. మృత్యువు మన పక్కనే వచ్చి క్షణాల్లో మనల్ని గెలిచేసి మన ప్రాణాలు తీసుకెళ్తుంది. పంజాబ్ లో అలాంటి విషాద సంఘటనే జరిగింది. మృత్యువు రైలు రూపంలో వచ్చి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 60 మంది ప్రాణాలు బలితీసుకుంది. అమృత్‌సర్‌ సమీపంలోని జోడా ఫాఠక్‌ రైల్వే క్రాసింగ్‌ వద్ద దసరాను పురస్కరించుకొని నిర్వహించిన రావణ దహనాన్ని చూసేందుకు వచ్చిన స్థానిక ప్రజలపైకి రైలు దూసుకుపోయింది. ఈ దుర్ఘటనలో 60 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 70 మంది గాయపడ్డారు.

రైల్వే ట్రాక్‌కు కేవలం 70-80 మీటర్ల దూరంలో ఖాళీ మైదానంలో స్థానికులు రావణ దహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని దాదాపు 300 మంది వీక్షిస్తున్నారు. రావణుడి బొమ్మను వెలిగించగానే.. బాణసంచా పేలుళ్లతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఇదే సమయంలో కొందరు పట్టాలపైకి వెళ్లడం మొదలుపెట్టారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమికూడారు. ఇదే ప్రమాదానికి కారణమైంది. వారు రావణ దహనాన్ని వీక్షించే సందడిలో ఉండగానే.. వేగంగా వచ్చిన రైలు వారిని ఢీకొంటూ వెళ్లిపోయింది. ఒక వైపు బాణసంచా తాలూకూ మోతలో రైలు కూత వినిపించలేదు. మరోవైపు  రావణుడి బొమ్మ దహనం వల్ల వెలువడ్డ పొగ, వెలుగులతో జనానికి సరిగా కనిపించలేదు. అదీగాక రైలు వచ్చినప్పుడు పక్క ట్రాకు మీదకు వెళ్దామంటే దాని మీద మరో రైలు వచ్చింది. ఈ అయోమయంలో జలంధర్‌ నుంచి అమృత్‌సర్‌ వైపు వేగంగా దూసుకెళుతున్న రైలు కిందపడి నలిగిపోయారు. 60 మృతిచెందగా.. 70 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య 100 దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మృతుల్లో చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.