ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరిక

 

 TPJAC has sought police permission,  Kodandaram TPJAC, Kodandaram Telangana

 

 

శాంతియుతంగా తాము ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పినా అనుమతి ఇవ్వకుండా, భారీగా పోలీసులను మోహరించి, ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, ముందస్తుగా తెలంగాణవాదులను అరెస్టులు చేస్తూ భయానక వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టిస్తోందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా తాము తలపెట్టిన ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిర్వహించి తీరుతామని కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు, ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన పార్టీలు రేపు ఇందిరా పార్క్ వద్దకు చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక వేళ పోలీసులు అడ్డుకుని నిర్భంధిస్తే ఎక్కడివాళ్లు అక్కడే నిరసన తెలియజేయాలని, శాంతియుతంగా జరగాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడవద్దని కోదండరాం విజ్ఞప్తి చేశారు.


న్యాయంగా, చట్టపరంగా ఛలో అసెంబ్లీని నిర్వహిస్తామని చెప్పినా ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని కోదండరాం తప్పుబట్టారు. రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎవరు తెలంగాణకు వచ్చినా అడ్డుకుంటామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. ఒకే వేళ అనుకోని సంఘటనలు జరిగితే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డే బాధ్యత వహించాలని చెప్పారు.