పొన్నాలకు లైన్‌ క్లియర్.. రేపే అభ్యర్థుల ప్రకటన

 

మహాకూటమిలో సీట్ల కేటాయింపు క్లైమాక్స్ కి వచ్చేసింది. ఇంకా కాంగ్రెస్ అధికారికంగా అభ్యర్థులను అయితే ప్రకటించలేదు కానీ.. బయటికి వస్తున్న లీకులు, ప్రచారాలతో అక్కడక్కడ అసంతృప్తి సెగ తగులుతుంది. కొందరేమో మేం చెప్పిన వ్యక్తికి టిక్కెట్ ఇవ్వాలని అంటుంటే.. మరికొందరేమో సీట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరిగింది అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు.

బీసీలకు గతంలో ఇచ్చినట్లే సీట్లు కేటాయించామని తెలిపారు. పార్టీలో బీసీలకు అన్యాయం జరగదన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారని, ఆయన వచ్చాక శనివారం సాయంత్రం అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. దేశ అవసరాల దృష్ట్యా టీడీపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. పొత్తుల వ్యవహారం ఇంకా పూర్తి కాలేదన్నారు. పార్టీలు తమకు కావాల్సిన సీట్లను అడిగాయని, టీడీపీకి 14, టీజేఎస్‌కు 8, సీపీఐకి 3-4 సీట్లు ఇస్తామని జానారెడ్డి తెలిపారు. అదేవిధంగా పొన్నాల లక్ష్మయ్య టికెట్‌కు లైన్‌ క్లియర్ చేశామని అన్నారు.  అకారణంగా ప్రభుత్వాన్ని రద్దు చేసిన దాఖలాలు ఎక్కడా లేవన్నారు. కేసీఆర్ తన స్వార్థ రాజకీయం కోసమే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ఆరోపించారు. తెలంగాణ సెంటిమెంట్‌తో ఓట్లు దండుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. కూటమిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. మూడో కూటమి అంటూ కేసీఆర్ దేశమంతా ఎందుకు తిరిగారు? అని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగే పనులు చేయబోమని జానారెడ్డి స్పష్టం చేశారు.