టుడేస్ స్పెషల్స్

 

ఈరోజు రాష్ట్రంలో, డిల్లీలో అనేక ఆసక్తికర సంఘటనలు జరుగబోతున్నాయి.

1.లోక్ సభలో రాష్ట్ర విభజన ప్రవేశపెట్టడం.

 

2. సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు మళ్ళీ తమ స్వంత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం.

 

3.రాష్ట్ర శాసనసభ చిట్ట చివరి సమావేశాలు ముగింపు.

 

4. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి, పార్టీకి రాజీనామా.

 

5. డిల్లీలో ఆమాద్మీ ప్రభుత్వం జనలోక్ పాల్ బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టడం. ఆమోదం పొందకపోతే డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పదవికి రాజీనామా.

 

ఈరోజు మధ్యాహ్నం ప్రశ్నోత్తరాల సమయం తరువాత రాష్ట్ర విభజన బిల్లుని కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టబోతోంది. అయితే అంతకంటే ముందుగానే దానిని అడ్డుకొనే ప్రయత్నంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరింపబడ్డ సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు, తమ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా మరో మారు అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు. అయితే దానిని సభలో చర్చకు ప్రవేశపెట్టాలంటే కనీసం 50మంది యంపీల మద్దతు అవసరం కాగా, ఇంతవరకు కేవలం 37 మంది యంపీలు మాత్రమే సంతకాలు చేసారు. కనుక మిగిలిన 13మంది మద్దతు కూడగట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.

 

ఇక రాష్ట్ర శాసనసభచిట్టచివరి సమావేశాలు ఈరోజుతోనే ముగుస్తాయి. ఈరోజే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేయవచ్చని తెలుస్తోంది.

 

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న జనలోక్ పాల్ బిల్లుని ఇక ఈరోజే డిల్లీ శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ఆమాద్మీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ బిల్లు ఆమోదం కోసం అవసరమయితే తను రాజీనామాకు కూడా సిద్దమేనని డిల్లీ ముఖ్యమంత్రి పదే పదే చెపుతున్నారు గనుక బహుశః ఆయన కూడా ఈరోజే తన పదవి నుండి తప్పుకొంటారేమో! అదే జరిగితే ఆమాద్మీ రెండు నెలల ముచ్చటగా మిగిలిపోతుంది.