ఆర్టీసీ కార్మికులకు టీఎన్జీవో మద్దతు... విలీనం చేయాల్సిందేనంటూ అల్టిమేటం

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని ఉద్యోగ సంఘాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాలు మద్దతుగా ప్రకటించగా, టీఎన్జీవో కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సపోర్ట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఆర్టీసీ సమ్మెకు మద్దతివ్వకపోతే ప్రజల్లో చులకనవుతామంటూ టీఎన్జీవో జిల్లా యూనియన్ల నుంచి రాష్ట్ర కార్యవర్గంపై ఒత్తిడి పెరగడంతో... ఎట్టకేలకు ఆర్టీసీ కార్మికులకు మద్దతిస్తున్నట్లు తెలిపారు.

టీఎన్జీవో రాష్ట్ర కార్యాలయంలో సుదీర్ఘంగా సమావేశమైన కార్యవర్గం... మొత్తం నాలుగు తీర్మానాలు చేసింది. ఆర్టీసీ సమ్మెకు మద్దతివ్వడంతోపాటు కార్మికుల తరపున చర్చలకు టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డిని సీఎం కేసీఆర్ దగ్గరకు పంపాలని నిర్ణయించారు. అలాగే ఆర్టీసీ కార్మికులందరినీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని మరో తీర్మానం చేశారు. అదేవిధంగా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లతోపాటు రాష్ట్ర ఉద్యోగుల సమస్యలపైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించాలని నిర్ణయించారు.

ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తమను తీవ్రంగా బాధించాయన్న టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి.... కిందిస్థాయి ఉద్యోగుల ఒత్తిడి మేరకు సమ్మెకు మద్దతిస్తున్నట్లు తెలిపారు. ఏదిఏమైనా ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని నిర్ణయించామన్న రవీందర్ రెడ్డి... అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహిచి... సీఎస్‌ను కలుస్తామన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని డిమాండ్ చేసిన టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి.... ప్రభుత్వం దిగిరాకపోతే.... మరో సకల జనుల సమ్మెకు సిద్ధంకావాల్సి వస్తుందని హెచ్చరించారు.

అయితే, ఆర్టీసీ సమ్మెకు టీఎన్జీవో మద్దతు ప్రకటించడంపై అశ్వద్ధామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవోలు అత్యంత కీలక పాత్ర పోషించారన్న అశ్వద్ధామరెడ్డి... తమకు మద్దతిచ్చిన టీజీవోలు, టీఎన్జీవోలకు రుణపడి ఉంటామన్నారు.