జేఏసీ- టీఆర్ఎస్ వార్ షురూ



 

రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు.. అప్పుడే టీఆర్ఎస్- టీ.జేఏసీల మధ్య విభేదాలు మొదలయ్యాయి. రాజకీయాలకు అతీతంగా ఏర్పాటైన జేఏసీకి, పూర్తిస్థాయి రాజకీయాలతో మునిగి తేలుతున్న టీఆర్ఎస్ కు మధ్య మొదటినుంచే పొరపొచ్చాలున్నా, ఎప్పటికప్పుడు పరస్పర అవసరాల దృష్ట్యా సర్దుకుపోతూ వచ్చారు. ఇప్పుడు ఆ అవసరాలు తగ్గడంతో జేఏసీ నాయకులు టీఆర్ఎస్ అధినాయకత్వం మీద.. ముఖ్యంగా కేసీఆర్ మీద మండిపడుతున్నారు. ఒంటికాలిపై లేస్తున్నారు. గతంలో మహబూబ్ నగర్ ఉప ఎన్నిక సందర్భంలో కూడా జేఏసీ వర్గాలు టీఆర్ఎస్ కు సహకరించలేదన్న కథనాలు వినిపించాయి. తాజాగా కూడా మరోసారి జేఏసీ ఛైర్మన్ కోదండరాం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద మండిపడ్డారు. కొండాదంపతులను పార్టీలో చేర్చుకోవడం పార్టీ వర్గాలతో పాటు జేఏసీ వర్గాలకు కూడా సుతరామూ ఇష్టం లేదు. దీనిపైనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

తెలంగాణా ద్రోహులకు టిక్కెట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి అడ్డుపడ్డ శక్తులు, వ్యక్తులను తీసుకొచ్చి, పదువులు ఇచ్చి, విశ్వాసం పోగొట్టుకోవద్దని సూచించారు. ఉద్యమ ద్రోహులకు టిక్కెట్లు ఇవ్వడం సరికాదన్నారు. అలాంటి వారికి నాయకత్వం అప్పగిస్తే, టిక్కెట్లు ఇస్తే ప్రజల విశ్వాసం సన్నిగిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

టీ.జేఏసీ తెలంగాణ అజెండా...

తెలంగాణా వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రాల్లో అమరుల స్మారక స్థూపాలను ఏర్పాటు చేయాలి ఉద్యమ సమయంలో విద్యార్థులు, ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేయాలి ప్రభుత్వ పథకాలను హక్కుగా అడిగే చట్టం ఉండాలి. తెలంగాణా రాష్ట్రంలో ప్రైవేటీకరణకు స్వస్తి చెప్పాలి కర్ణాటక తరహాలో లోకాయుక్త ఉండాలి. జిల్లాల్లో ఐటీ కారిడార్లు ఏర్పాటు చేయాలి. 1956 నుంచి జరిగిన భూకేటాయింపులపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలి. రైతుల రుణాలు మాఫీ చేయాలి.