తిరుపతిలో బోగస్.. సాగర్ లో సైలెంట్! రాజన్న రాజ్యం స్పెషల్?  

రెండు తెలుగు రాష్ట్రాలు. రెండు ఉప ఎన్నిక‌లు. ఒక‌టి తిరుప‌తి. మ‌రొక‌టి నాగార్జున సాగ‌ర్‌. రెండూ అధికార పార్టీకి కీల‌క‌మే. రెండుచోట్లా బ‌ల‌మైన‌ ప్ర‌తిప‌క్షమే. అయినా, ఎంత తేడా? ఎంతో తేడా. సాగ‌ర్ అసెంబ్లీ ఎల‌క్ష‌న్‌.. సైలెంట్‌గా సాగింది. పోలింగ్ నాడు తిరుప‌తిలో నానా ర‌చ్చ జ‌రిగింది. దొంగ ఓట్ల దారుణంతో ద‌ద్ద‌రిల్లింది. నాగార్జున‌సాగ‌ర్‌లో చీమ చిటుక్కుమ‌న‌కుండా ప్ర‌శాంతంగా పోలింగ్‌. తిరుప‌తిలో దొంగ ఓట్ల సునామీ మ‌ధ్య కేవ‌లం 65 శాతం పోలింగ్ మాత్ర‌మే జ‌రిగింది. అదే, సాగ‌ర్‌లో ఏకంగా ఓటింగ్ 88 శాతం దాటేసింది. తిరుప‌తిలో దొంగ నోట్లు పోటెత్తితే.. సాగ‌ర్‌లో సాధార‌ణ ఓట‌ర్లు పోలింగ్‌కు క్యూ క‌ట్టి రికార్డు స్థాయిలో ఓటింగ్ చేశారు. 

తిరుప‌తి బైపోల్‌ను టీడీపీ స‌వాల్‌గా తీసుకుంది. నోటిఫికేష‌న్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది. అంద‌రికంటే ముందే అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది. సీనియ‌ర్ మోస్ట్ లీడ‌ర్ ప‌న‌బాక ల‌క్ష్మిని బ‌రిలో దించింది. ఈ విష‌యంలో వైసీపీ, బీజేపీలు చాలా వెన‌క‌బ‌డ్డాయి. ఆల‌స్యంగా అభ్య‌ర్థి ఎంపిక‌తో పాటు కొత్త ముఖాల‌తో అదృష్టం ప‌రీక్షించుకున్నాయి. తెలంగాణ‌లోనూ దాదాపు ఇదే త‌ర‌హా వ్య‌వ‌హారం న‌డిచింది. నోముల న‌ర్సింహ‌య్య మ‌ర‌ణంతో ఆయ‌న కొడుకు భ‌గ‌త్‌కే టికెట్ కేటాయించింది టీఆర్ఎస్‌. యువ‌కుడు, రాజ‌కీయాల‌కు కొత్త వాడైనా కూడా సెంటిమెంట్ క‌లిసొస్తుంద‌ని లెక్క‌లేసింది. బీజేపీ సైతం కొత్త లీడ‌ర్‌, అందులోనూ ఎస్టీ నాయ‌కుడిని నిల‌బెట్టి పొలిటిక‌ల్‌గా ప్ర‌యోగం చేసింది. ఇక కాంగ్రెస్ నుంచి మాత్రం కాక‌లుతీరిన రాజ‌కీయ యోథుడు జానారెడ్డి బ‌ల‌మైన కేండిడేట్‌గా బ‌రిలో నిలిచాడు. పోరు, జానారెడ్డి వ‌ర్సెస్ కేసీఆర్‌గా మారింది.

ఏపీలో ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌న్నీ ఒక లెక్క‌. తిరుప‌తి ఉప ఎన్నిక మ‌రోలెక్క అన్న‌ట్టు ప్ర‌చారం కాక‌రేపింది. ప్ర‌చారానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌చ్చినా.. బీజేపీలో పెద్ద‌గా జోష్ క‌నిపించ‌లేదు. అధికార వైసీపీ స‌భ‌లూ జ‌నం లేక వెల‌వెల‌పోయాయి. క‌రోనా కార‌ణంతో జ‌గ‌న్ సైతం మ‌డ‌మ తిప్పారు. ఇక‌, తిరుప‌తి ఎంపీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ప్ర‌చార సంద‌డంతా ప్ర‌తిప‌క్ష టీడీపీదే. చంద్ర‌బాబు, లోకేశ్‌లు తిరుప‌తి అంతా చుట్టేశారు. ప‌రిస్థితి చ‌క్క‌బెట్టేశారు. వాళ్లిద్ద‌రు ఎక్క‌డ రోడ్ షో చేసినా.. జ‌నం భారీగా త‌ర‌లివ‌చ్చారు. తెలుగు త‌మ్ముళ్ల‌లో ఉత్సాహం ఉర‌క‌లెత్తింది. మీడియా అటెన్ష‌న్ ఆసాంతం తిరుప‌తిపైనే కొన‌సాగింది. అటు నాగార్జున సాగ‌ర్‌లో కేసీఆర్ స‌భ సాధాసీదాగా సాగింది. ఏ పార్టీ ఎక్క‌డ ప్ర‌చారం చేసిందో.. ఏ నేత ఎవ‌రిని క‌లిశారో.. బ‌య‌టి వారెవ‌రికీ తెలీదు. తిరుప‌తి ప్ర‌చారం రెండు తెలుగు రాష్ట్రాలు, మీడియాలో హోరెత్తితే.. సాగ‌ర్ ఎన్నిక‌ల‌ ప్ర‌చారంపై స్థానికులే పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేదు. 

పోలింగ్ విష‌యంలో మాత్రం సీన్ రివ‌ర్స్ అయింది. సాగ‌ర్‌లో ఓటేసేందుకు ఓట‌ర్లు వెల్లువ‌లా వ‌స్తే.. తిరుప‌తిలో మాత్రం దొంగ ఓట్లు కుమ్మేసేందుకు ప‌క్క నియోజ‌క వ‌ర్గాల నుంచి బ‌స్సులు క్యూ క‌ట్టాయి. పోలింగ్ రోజు ర‌చ్చ రంబోలా జ‌రిగింది. సాగ‌ర్‌లో అంతా సైలెన్స్‌. పోలింగ్ డే పీస్‌ఫుల్‌. బ‌ల‌మైన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు ఉంటే తిరుప‌తి ఎన్నిక‌ల్లో మాదిరి పోరాడుతారు. బ‌ల‌హీన విప‌క్షం ఉంటే సాగ‌ర్ మాదిరి సైలెంట్ అన్న‌ట్టు ప్ర‌చారం సాగుతుంది. చంద్ర‌బాబు, లోకేశ్‌లు వారాల పాటు మండుటెండ‌లో విప‌రీతంగా క‌ష్ట‌ప‌డ్డారు, ప‌గ‌లు, రాత్రి ఇంటింటి ప్ర‌చారంతో ఓట‌ర్ల‌ను ఉత్సాహ ప‌రిచారు. నాగార్జున సాగ‌ర్‌లో మాత్రం జానారెడ్డి గ‌ప్‌చుప్‌గా ప‌ని చేసుకు పోయారు. 

ప్ర‌చారం, పోలింగ్ విధానంలో తేడా ఉన్నా.. ఫ‌లితాల్లో మాత్రం తిరుప‌తి, సాగ‌ర్‌లో ఒకే విధంగా వ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. రెండు చోట్లా అధికార పార్టీపై వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపించింద‌ని.. ఆ ఫ‌లితం ఈవీఎమ్‌ల‌లో భ‌ద్రంగా దాగుంద‌ని అంటున్నారు.  తిరుప‌తిలో 6 ల‌క్ష‌ల మెజార్టీ మాటేమో కానీ, బొటాబొటి ఆధిక్యంతో బ‌య‌ట‌ప‌డితే అదే చాలు అనే ఆందోళ‌న వైసీపీలో కొట్టొచ్చిన‌ట్టు క‌న‌బ‌డుతోంది. ఒక‌వేళ తిరుప‌తిలో అధికార పార్టీ బ‌య‌ట‌ప‌డితే.. అది దొంగ ఓట్ల మ‌హిమే కానీ మ‌రొక‌టి కాక‌పోవ‌చ్చు. సాగ‌ర్‌లో బ‌ల‌మైన నేత జానారెడ్డి బ‌ల‌మెంతో ఈ ఎన్నిక‌తో తేలిపోనుంది. కేసీఆర్ ప్ర‌జాధార‌ణ‌కూ ప‌రీక్ష కానుంది. ఇటు తిరుప‌తి, అటు సాగ‌ర్‌.. అధికార పార్టీల‌కు టెన్ష‌న్ టెన్ష‌న్‌.