తిరుప‌తి ల‌బ్‌డ‌బ్‌.. వైసీపీలో డ‌గ్‌డ‌గ్‌..

అంత‌న్నారు. ఇంత‌న్నారు. తిరుప‌తి మాదేన‌న్నారు. 6 ల‌క్ష‌ల‌కు పైగా మెజార్టీ ఖాయ‌మ‌న్నారు. అరెవో సాంబా.. రాస్కో.. అన్నంత బిల్డ‌ప్ ఇచ్చారు. తీరా పోలింగ్ రోజు వ‌చ్చేస‌రికి. చేతులెత్తేశారు. అధికార వైసీపీలో గెలుపు భ‌యం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింది. ఓడిపోతామ‌నే టెన్ష‌న్‌లో దొంగ ఓట్ల‌తో దిగ‌జారిపోయారు. తిరుప‌తి వెంక‌న్న సాక్షిగా ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేశారు. మునుపెన్న‌డూ లేనంత‌గా తిరుప‌తి ఎంపీ ఉప ఎన్నిక ర‌చ్చ రచ్చగా మారింది. ఏకంగా తిరుప‌తి ఎన్నిక‌ను ర‌ద్దు చేయాల‌నేంత వ‌ర‌కూ విష‌యం వివాదాస్ప‌ద‌మవ‌డం మామూలు మేట‌ర్‌ కానేకాదు.

ఓట‌మి భ‌యం, గెల‌వాల‌నే కుట్ర‌తోనే వైసీపీ ఈ స్థాయిలో దొంగ ఓట్ల దందాకు తెగ‌బ‌డింద‌ని చెబుతున్నారు. 6 ల‌క్ష‌ల మెజార్టీ వ‌స్తుందంటూ ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన వైసీపీ నేత‌లు.. అంత ఆధిక్యం వ‌స్తే మ‌రెందుకు ఇంతగా దొంగ ఓట్ల దారుణం? అని ప్ర‌శ్నిస్తున్నారు. అంటే, తాము ఎలానూ గెల‌వమ‌ని వారు అనుకున్నారా?  గెలుపుపై ధీమా స‌డ‌లిందా?  లేక‌, త‌మ అధినేత జ‌గ‌న్ రెడ్డి 6 ల‌క్ష‌లు టార్గెట్ పెట్టారు కాబ‌ట్టి ఇలా బ‌రి తెగించారా? అని ప్ర‌తిప‌క్షాలు నిల‌దీస్తున్నాయి. 

ఎంత దారుణం? ఎంత అప్ర‌జాస్వామికం? ఒక‌టా, రెండా.. వంద‌లాది బ‌స్సులు.. వేలాది మంది దొంగ ఓట‌ర్లును.. తిరుప‌తి మొత్తం దించేశారు. విచ్చ‌ల‌విడిగా దొంగ ఓట్లు వేసేందుకు లైసెన్సులు ఇచ్చేశారు. పాలించే వాడు వాళ్ల‌ వాడే.. అడ్డుకోవాల్సిన పోలీసులే వారికి ఎస్కార్టులు.. పాల‌కులే దగ్గ‌రుండి మ‌రీ దొంగ ఓట్లు వేయించారు. మీడియా సాక్షిగా తిరుప‌తి ఎన్నిక‌లో దొంగ ఓట్ల ప్ర‌హ‌స‌నం కొన‌సాగింది. ఇంతా చేస్తే.. పోలింగ్ శాతం ఏమైనా పెరిగిందా? అంటే అదీ లేదు. చాలా త‌క్కువ‌గా.. 65 శాతం ద‌గ్గ‌రే ఆగిపోయింది. ఇంత త‌క్కువ శాతం పోలింగ్ ఎవ‌రికి లాభం? మ‌రెవ‌రికి న‌ష్టం? అనే విశ్లేష‌ణ‌లు జోరుగా సాగుతున్నాయి. 

ఓటింగ్ శాతం త‌గ్గ‌డం అధికార పార్టీని క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది. ఓట‌ర్ల తీర్పు ఎలా ఉండ‌బోతుందోన‌నే టెన్ష‌న్ మొద‌లైంది. ఇలాగైతే 6 ల‌క్ష‌ల మెజార్టీ మాటేమో గానీ.. గెలిస్తే  అదే చాల‌న్న భ‌యం వారిని వెంటాడుతోంది. 

ఇటీవ‌ల జ‌రిగిన కార్పొరేష‌న్‌, పంచాయ‌తీ, ప‌‌రిష‌త్ ఎన్నికల‌న్నీ వైసీపీ గంప గుత్త‌గా కొల్ల‌గొట్టేసింది. ఏక‌గ్రీవాల మాటున అధికార పార్టీ ఆగ‌డాలకు అడ్డే లేకుండా పోయింది. న‌యానో, భ‌యానో దాదాపు అన్ని ఎన్నికల్లోనై వైసీపీదే హ‌వా. కానీ, తిరుప‌తికి వ‌చ్చే స‌రికి సీన్ రివ‌ర్స్. తిరుప‌తి ఎంపీ బై పోల్‌ను టీడీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. చంద్ర‌బాబు, లోకేశ్‌లు కాలికి బ‌ల‌పం క‌ట్టుకొని తిరిగారు. ఊరూరా తెలుగుదేశానికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు స్థానికులు. టీడీపీ జోష్ చూసి వైసీపీలో క‌ల‌వ‌ర‌పాటు మొద‌లైంది. అందుకే, ఓ ద‌శ‌లో జ‌గ‌న్ సైతం ప్ర‌చారానికి వ‌స్తాన‌న్నారు. తాను ప్ర‌చారం చేసినా ఓడిపోతే ప‌రువు పోతుంద‌నుకున్నారో ఏమో.. క‌రోనా సాకుతో క్యాంపెయిన్‌కు డుమ్మా కొట్టారు. గెలుపుపై కాన్ఫిడెన్స్ లేక‌పోవ‌డం వ‌ల్లే జ‌గ‌న్ ప్ర‌చారానికి రాలేద‌నేది విప‌క్షాల విమ‌ర్శ‌. ప్ర‌చార స‌మ‌యంలోనే ఇక‌ వైసీపీ ప‌ని అయిపోయింద‌ని అన్నారంతా. శ‌నివారం నాటి పోలింగ్‌తో మ‌రింత క్లారిటీ వ‌చ్చేసింది. పోలింగ్ జ‌రిగిన తీరు.. వైసీపీ దొంగ‌నోట్ల దిగ‌జారుడు.. ఇవ‌న్నీ వైసీపీ ఓట‌మికి సిగ్న‌ల్స్ అంటున్నారు. అందుకే, తిరుప‌తి ఫ‌లితాల‌పై అధికార పార్టీలో ఎన‌లేని ఉత్కంఠ‌.