వైసీపీ నేతను చితక్కొట్టిన ఓటర్లు! 

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌కు చేదు అనుభవం ఎదురైంది. బురదగాలి కొత్తపాళెంలో వరప్రసాద్‌ను ఓటర్లు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేతో వెళ్లిన వైసీపీ నాయకుడిని చితక్కొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రెండేళ్లుగా తమ సమస్యలు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిట్టమూరు మండలం బురదగాలి కొత్త పాళెం పంచాయతీలో సుమారు 2,000మంది ఓటర్లు ఉన్నారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు రోడ్డు, తాగునీటి సమస్య తీర్చ లేదని అప్పట్లో ఓటు వేయకుండా స్థానికులు బహిష్కరించారు. అప్పటి ఎమ్మెల్యే  అభ్యర్థి డా. వెలగపల్లి వరప్రసాద్ రావు ఓటర్ల వద్దకు వెళ్లి ఓటు వేస్తే గెలిచిన 6 నెలలకే సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు.

అయితే ఎమ్మె‌ల్యేగా గెలిచిన తరువాత ఇచ్చిన హామీ నెరవేర్చ లేదు ఎమ్మెల్యే వరప్రసాద్.  తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో అభ్యర్థులు ఎవ్వరు సమస్యలను గుర్తించలేదని ఎంపీ ఎన్నికలను బహిష్కరించారు. విషయం తెలుసుకున్న గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ బురద గాలి కొత్త పాళెం వెళ్లి ఓటర్ల‌కు సర్ది చెప్పినా వినలేదు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ద్వారా సర్ది చెప్పినా ఓటర్లు వినలేదు.