బీజేపీ కీలక భేటీకి ముగ్గురు ఎంపీల డుమ్మా.. జీవీఎల్ తో విభేదాలే కారణమా?

ఏపీలో 2024 ఎన్నికలే లక్ష్యంగా జనసేనతో పొత్తు పెట్టుకుని స్ధానిక సంస్ధల ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్న బీజేపీకి స్వయానా ఆ పార్టీ నేతలే షాకిచ్చారు. విజయవాడలో జరుగుతున్న బీజీపీ పదాధికారుల భేటీకి టీడీపీ నుంచి కాషాయ పార్టీకి ఫిరాయించిన ముగ్గురు ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ డుమ్మా కొట్టారు. కేంద్ర బడ్జెట్ పై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోముందుగా పార్టీ నేతలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు స్వయానా పార్టీ ఎంపీలే రాకపోవడం కాషాయదళంలో చర్చనీయాంశమవుతోంది.

ఏపీ బీజేపీలో వర్గ పోరు మరోసారి బహిర్గతమైంది. కేంద్ర బడ్జెట్ పై పార్టీ నేతలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన పదాధికారుల సమావేశానికి ఏకంగా పార్టీ ఎంపీలే డుమ్మా కొట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు రాజ్యసభ ఎంపీ, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, వాకాటి నారాయణరెడ్డి, మాధవ్ తో పాటు సీనియర్ నేత పురంధేశ్వరి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే టీడీపీ నుంచి ఈ మధ్యే పార్టీలో చేరిన ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ మాత్రం హాజరు కాలేదు. వీరు వస్తారో రారో కూడా సమాచారం లేదు. దీంతో ఈ సదస్సుకు హాజరైన బీజేపీ నేతలంతా వీరిపై చర్చించుకోవడం కనిపించింది. కేంద్ర బడ్జెట్ పై ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగించేందుకు ముందుగా పార్టీ నేతలకు అవగాహన తప్పనిసరి. ఎంపీలకు అవగాహన ఉంటేనే వారు రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ప్రజలకు బడ్జెట్ లో సానుకూలతలను వివరించే అవకాశం ఉంటుంది. అలాంటిది పార్టీ అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఎంపీలే తేలిగ్గా తీసుకోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

పదాధికారుల సదస్సుకు ముగ్గురు బీజేపీ ఎంపీలు గైర్హాజరు కావడం వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా వర్గంతో ఉన్న విభేదాలు ఇందుకు ప్రధాన కారణం. కన్నా నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్న సుజనా వర్గం కావాలనే ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల వ్యవహారంతో పాటు గతంలో ఆంగ్ల మాధ్యమం అమలు వంటి కీలక విషయాల్లో వీరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. దీంతో పాటు జనసేనతో పొత్తు తర్వాత పార్టీలో మారిన ప్రాధామ్యాలు, ఇతర అంశాలు కూడా టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలకూ పార్టీలో ఎప్పటి నుంచో ఉంటున్న నేతలకూ మధ్య దూరాన్ని పెంచుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాజ్యసభ ఎంపీ, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుతో ఉన్న విభేదాల వల్లే ముగ్గురు ఎంపీలు ఈ సదస్సుకు రాలేదని కూడా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గతంలో పలు విషయాల్లో జీవీఎల్ తో ఈ ముగ్గురు ఎంపీలు విభేధించారు. కేంద్ర బడ్జెట్ కు సంబంధించి పార్ట నేతలకు అవగాహన కల్పించేందుకు జీవీఎల్ ఏర్పాటు చేయించిన ఈ సదస్సుకు తాము వెళ్లడం అవసరమా అనే భావనతో వీరు ఉన్నట్లు తెలుస్తోంది.