ఏపీకి 1000 కోట్ల సాయం: మోడీ

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెయ్యి కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. హుదూద్ తుఫాను దాటికి కకావికలమైన విశాఖపట్టణాన్ని నరేంద్రమోడీ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఏపీ సీఎం చంద్రబాబుతో కలసి విశాఖపట్టణంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి ఆయన పరిశీలించారు. అనంతరం విశాఖ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో నరేంద్ర మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ వెయ్యి కోట్ల రూపాయల తక్షణ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. తుఫాను సహాయక కార్యక్రమాలు చేయడంలో కేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కలసికట్టుగా పనిచేశాయని ఆయన అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని తుఫాను నష్టం తగ్గేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశంసనీయంగా పనిచేసిందని ఈ సందర్భంగా మోడీ అన్నారు. అలాగే మృతులకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50 వేలు కేంద్రం నుంచి ఆర్థికసాయం అందిస్తామని మోడీ చెప్పారు. ఒడిస్సాను కూడా ఆదుకుంటామన్నారు. విశాఖను స్మార్ట్ సిటీగా చేస్తానని అమెరికాలోనే చెప్పిన విషయాన్ని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

 

విశాఖకు వచ్చిన వెంటనే మోడీ మొదట తీవ్రంగా ధ్వంసమైన విమానాశ్రయాన్ని పరిశీలించారు. ఆ తర్వాత చంద్రబాబుతోకలసి విశాఖపట్టణంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. అలాగే ఏరియల్ సర్వే కూడా చేసి, అనంతరం తుఫాను చిత్రాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను కూడా తిలకించారు.