తూర్పు టీడీపీలో తోట మంట

 

మాజీ మంత్రి తోట నరసింహం కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరగానే కాకినాడ పార్లమెంటు సీటు తనదేనంటూ పార్టీలో అన్నీ తానే అన్నట్టు ప్రకటించుకోవడం టీడీపీలో కొత్త చిచ్చురేపింది. తన మామ, మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావుతో దౌత్యం నడిపించి మరీ నరసింహం టీడీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్టు ప్రచారమైంది. దాంతో అక్కడి టికెట్ ఆశిస్తున్న జ్యోతుల చంటిబాబు వర్గం కన్నెర్ర చేసింది. చంటిబాబు 24 గంటల అల్టిమేటమ్ ఇవ్వడంతో చంద్రబాబు ఆయనను చర్చలకు పిలిచి, జగ్గంపేట టిక్కెట్టు మరెవరికీ ఇచ్చేది లేదని చెప్పారు. దాంతో కొంతవరకు వివాదం సర్దుమణిగిందని అనుకుంటుంటే.. కాకినాడ ఎంపీ సీటు తనదేనని జిల్లా ముఖ్య నేతల సమక్షంలోనే తోట ప్రకటించుకున్నారు. దీంతో, కాకినాడ పార్లమెంటు సీటుపై ఆశలు పెంచుకుని, గడచిన ఆరేడు నెలలుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న విశ్వంను రేసు నుంచి తప్పించేందుకు మామా, అల్లుళ్లైన మెట్ల, తోట ఎత్తులు వేస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. గతంలో తునిలో నిర్వహించిన కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పార్టీ సమావేశంలో విశ్వంను ఎంపీ అభ్యర్థిగా పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ యనమల రామకృష్ణుడు నేతలకు పరిచయం చేశారు. అంతకంటే ముందు పెద్దాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి అని ప్రకటించారు. పెద్దాపురం టిక్కెట్టు కమ్మ సామాజికవర్గానికి ఇవ్వాలనే నిర్ణయంతో విశ్వం సీటు పెద్దాపురం నుంచి ఒకసారి పిఠాపురం అని, మరోసారి కాకినాడ రూరల్ అని..మార్చి, మార్చి ఇప్పుడు కాకినాడ ఎంపీ సీటుకు కూడా ఎసరు పెడుతున్నారని ఆయన అనుచరులు, కైట్ విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాకు దిగారు. దీంతో ఏం చేయాలో తెలియక పార్టీ నాయకత్వం తల పట్టుకుంటోంది.