ఐదు రూపాయలు దొంగతనం.. ఐదేళ్ల జైలు శిక్ష..!!

ఐదు రూపాయలు దొంగతనం చేసినందుకు ఐదేళ్ల జైలు శిక్షా.!! ఊరుకోండి.. అలా అనుకుంటే చిన్నపిల్లలు తెలిసో తెలియకో పెన్ను, పెన్సిల్ దొంగతనం చేస్తారు.. అంతమాత్రాన ఐదేళ్ల జైలు శిక్ష వేస్తారా? అని అడుగుతారా.. అసలు మేటర్ తెలిస్తే అలా అడగరులెండి.. ఇంతకీ విషయం ఏంటంటే.. ఢిల్లీలో ఓ 43ఏళ్ల వ్యాపారి వస్త్రాల తయారీకి ఉపయోగపడే ముడిసరుకు తయారుచేసి, సరఫరా చేస్తుంటాడు.. అతని వద్ద ఖలీద్ అనే వ్యక్తి ముడిసరుకు కొంటుండేవాడు.. అయితే వ్యాపారి నిత్యం తన వ్యాపారానికి సంబంధించిన డబ్బులను  బ్యాగులో పెట్టుకుని ప్రయాణించడాన్ని ఖలీద్ గమనించాడు.. ఇంకేముంది అతనిలో దొంగ మేల్కొన్నాడు.. బ్యాగ్ కొట్టు డబ్బు పట్టు అనుకున్నాడు.

 

 

ఓ నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి ప్లాన్ వేసాడు.. ఒక రోజు వ్యాపారి తన ఇంటికి స్కూటర్ పై వెళుతుండగా ఖలీద్ గ్యాంగ్ ముసుగులు ధరించి వచ్చి వ్యాపారిని అడ్డుకున్నారు.. అతడిని గన్ తో బెదిరించి,కళ్లలో కారం చల్లి బ్యాగుతో పాటు స్కూటర్ ని తీసుకుని పరారయ్యారు.. అయితే ఆ బ్యాగులోని డబ్బులను చూసి ఖలీద్ గ్యాంగ్ అవాక్కయ్యారు.. బ్యాగులో లక్షల్లో డబ్బులుంటాయని భావించి దొంగతనానికి పాల్పడితే అందులో ఐదు రూపాయలు మాత్రమే ఉన్నాయి.. ఈ దొంగతనంపై వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగల ముఠాను అరెస్ట్ చేశారు.. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా నేరం రుజువైంది.. దీంతో వారికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.