బాబు మీద మరక వేయడానికి జగన్ కి రెండో అవకాశం కూడా పోయిందా ?

 

ఎంతో కష్టపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్, అభివృద్ధి మీద కాక అవినీతి మీద ద్రుష్టి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. తనని పదే పదే అక్రమాస్తుల కేసును ఉద్దేశిస్తూ చంద్రబాబు, ఆయన పార్టీ చేసిన అవినీతి ఆరోపణల మీద రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నాడో ఏమో కానీ ఎలా అయినా చంద్రబాబు అవినీతి పరుడు అనే ముద్ర వేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. 

అందుకు అనుగుణంగానే బాబు నిర్ణయాలు, ఆయన ప్రభుత్వ ఉత్తరవుల మీద కేబినేట్ సబ్ కమిటీల మీద కమిటీలు వేసుకుంటూ వెళ్తున్నాడు. అలాగే అమరావతి, పోలవరం, విధ్యుత్ కొనుగోళ్ళ విషయాల్లో తెలుగుదేశంని టార్గెట్ చేయడానికి చూస్తోంటే ఎప్పటికప్పుడు అది ఎదురు తిరుగుతూనే ఉంది. చంద్రబాబు హయాంలో చేసుకున్న సౌర, పవన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)ల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని జగన్ సర్కారు భావిస్తోంది. 

అందుకే వాటిని ఎలా అయిన బయట పెట్టాలని చూస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇందులో అవకతవకలేమీ చోటు చేసుకోలేదని, పీపీఏలను రద్దు చేస్తే.. దాని ప్రభావం పెట్టుబడులపై పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ఇటీవలే జగన్‌కు లేఖ రాసిన రాశారు. అలా ఒక విషయంలో గేట్లు క్లోజ్ అవ్వగా నిన్న మరో విషయంలో కూడా గేట్లు క్లోజ్ అయ్యాయి. అదే పోలవరం, పోలవరం నిర్మాణంలో అవకతవలకు సంబంధించి నిన్న రాజ్యసభలో వైసీపీ, బీజేపీ సభ్యులు కొన్ని ప్రశ్నలు సంధించారు. 

అంతేకాక పోలవరంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని ఈ సందర్భంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం, పునర్నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. అయితే విజయసాయి ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగినట్టు తమకు ఎలాంటి నివేదికలు రాలేదని తేల్చి చెప్పారు. 

అందుకే ఈ విషయం మీద విచారణకు ఆదేశించే అవకాశం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాక పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని, విభజన చట్టంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని షెకావత్ తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి వంద శాతం నిధులను కేంద్రమే భరిస్తుందని చెప్ప్పిన ఆయన నిర్మాణ పనులు ఇప్పటి వరకు 60 శాతం వరకు పూర్తి అయ్యాయని తెలిపారు.