అసలు వైఎస్సార్ పార్టీ మాది

ఎంపీ రఘురామ కృష్ణంరాజుకి షోకాజ్ నోటిస్ ఇచ్చి వైసీపీనే ఇరుకున పడినట్టు అనిపిస్తోంది. అసలు మన పార్టీ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించిన రఘురామ కృష్ణంరాజు.. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ పార్టీ పేరు వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. 

తాజాగా అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా.. ఢిల్లీలో చీఫ్ ఎన్నికల కమిషనర్‌ను కలిశారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని కోరారు. వైఎస్సార్ అని రాయకుండా, పిలవకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 

అసలు వైఎస్సార్ పార్టీ తమదేనని మహబూబ్ బాషా అన్నారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.. వైఎస్సార్ పార్టీ పేరుతో వాళ్ల ఎంపీలకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. దీనిపై సుప్రీం కోర్టులో కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తామని మహబూబ్ బాషా తెలిపారు.