వీర జవాన్ లారా! లాఠీలతోనే దేశాన్ని కాపాడేయండి

 

నిన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం శ్రీనగర్ లో సీఆర్పీయఫ్ దళాలపై పాకిస్తానీ ఉగ్రవాదులు చేసిన దాడిలో 5మంది జవాన్లు మరణించగా, మరో 8మంది తీవ్ర గాయపడ్డారు. వారి చేతుల్లో ఆయుధాలుకు బదులు కేవలం లాఠీలు మాత్రమే ఉండటంవల్లనే వారందరూ ఉగ్రవాదుల చేతుల్లో మరణించారని స్వయంగా అక్కడి జవాన్లే మీడియాకి వెల్లడించడంతో దేశం మొత్తం దిగ్భ్రాంతి చెందింది.

 

అందుకు కారణం, ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడిపై కేంద్రహోం శాఖ వారిని లాఠీలతో సరిబెట్టుకోమని ఆదేశించింది. తత్ఫలితంగా 5మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. మన పొరుగునున్న పాకిస్తాన్ నిత్యం మన దేశంలోకి ఎగుమతి చేస్తున్న ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు నియమింపబడిన మన జవాన్లకు అత్యాధునిక ఆయుధాలు ఇవ్వకపోగా, ఉన్న ఆయుధాలను కూడా తీసేసుకొన్న ప్రభుత్వం పరోక్షంగా వారి చావుకి కారణం అయింది.

 

ఇక మరో విచారకరమయిన విషయం ఏమిటంటే, 5మంది జవాన్లు మరణించినా స్థానికంగానే ఉండే ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కనీసం తమ సహచరుల మరణానికి సానుభూతిగా నాలుగు మాటలు కూడా పలుకలేకపోయాడని, దేశం కోసం పోరాడుతూ మరణిస్తున్న తమ ప్రాణాలకు అసలు విలువ, గౌరవం లేకుండా పోయాయని అక్కడి జవాన్లు మీడియాతో అన్నతరువాతనే ముఖ్యమంత్రి హడావుడిగా వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు.

 

జవాన్లు పలికిన ఈ మాటలు రాజధాని వరకు పాకిన తరువాతనే పార్లమెంటు కూడా వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించడం మన రాజకీయ నాయకులకు, ప్రభుత్వాలకు మన జవాన్లపట్ల ఎంత గౌరవం ఉందో తెలియజేస్తోంది. ఉగ్రవాదులు మన దేశం పై దాడి చేస్తే దానిపై రాజకీయ రగడ చేయడమే తప్ప, కనీసం మరణించిన వారికి సానుభూతి తెలపాలని మన రాజకీయ నేతలకి ఆలోచన కలుగకపోవడం నిజంగా దురదృష్టం.

 

ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ హోం మంత్రి సుషీల్ కుమార్ షిండే, కాశ్మీరులో నెలకొన్న సున్నితమయిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొనే జవాన్లకు ఆయుధాలు చేత బట్టుకొని తిరిగేందుకు అనుమతినీయలేదని అన్నారు. ఈ నిర్ణయం వలన 5 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోవడమే గాకుండా, ఆ జవాన్ల కుటుంబాలకు జీవితకాల శోకం మిగిలింది. దేశాన్ని రక్షించాలని కోరిన సైనికులను తగిన ఆయుధాలు కూడా ఇచ్చేందుకు వెనకాడుతున్న ప్రభుత్వం ప్రపంచంలో మరెక్కడా ఉండదేమో.