కెనడా పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి?

 

 

 

కెనడా పార్లమెంటుపై గుర్తు తెలియని కొందరు దుండగులు బుదవారంనాడు కాల్పులు జరిపారు. రాజధాని ఒట్టావా నగరంలో గల జాతీయ యుద్ద స్మారక స్థూపం వద్ద పహరా కాస్తున్న సైనికుడు ఒకరు ఈ కాల్పులలో మరణించినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రత్తమయిన కెనడా భద్రతాదళాలు పార్లమెంటును చుట్టుముట్టి ఎదురు కాల్పులు జరుపగా దాడికి పాల్పడిన వారిలో ఒకరు చనిపోయినట్లు సమాచారం. పార్లమెంటుపై దాడి జరిగిన సమయంలో లోపల కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పెర్ తో సహా అనేకమంది లోపల ఉన్నారు. భద్రతా దళాలు వారందరినీ క్షేమంగా బయటకు తరలించినట్లు సమాచారం. ఈ దాడిలో మొత్తం మూడు నుండి ఐదుగురు ఉగ్రవాదులు పాల్గొని ఉండవచ్చని భద్రతా దళాలు భావిస్తున్నాయి.

 

సిరియా, ఇరాక్ దేశాలలో పెట్రేగిపోతున్న ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులపై యుద్దానికి దిగిన అమెరికా, ఫ్రాన్స్ మరి కొన్ని దేశాలతో కెనడా కూడా చేతులు కలిపినప్పటి నుండే ఆ దేశంలో ఇటువంటి చెదురు ముదురు ఘటనలు జరగడం మొదలయ్యాయి. కనుక ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని కెనడా ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ దాడికి బాధ్యతా వహిస్తున్నట్లు ప్రకటించలేదు.