యమ్ సెట్ ... యమ టెన్షన్

 

 

Tension over EAMCET, Inter students tension over EAMCET, students tension over EAMCET Tension over EAMCET, Inter students tension over EAMCET, students tension over EAMCET

 

 

May 10 శుక్రవారం హైదరాబాద్ లో ఎంసెట్ ఎగ్జామ్ రాయవలసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నరకాన్ని చవిచూశారు. కారణం, ఎలాంటి ట్రాఫిక్ నిబంధనలు, ట్రాఫిక్ పరంగా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు పాటించకపోవటం ట్రాఫిక్ కమీషనర్ C.V. ఆనంద్ బాధ్యతారాహిత్యం తేటతెల్లమవుతుంది.


నగరంలో ఎలాంటి మతసంబంధిత ఊరేగింపులు జరిగినా, ఎలాంటి రాజకీయ బహిరంగసభలు జరిగినా ట్రాఫిక్ డైవర్షన్ పెట్టి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ఈ పోలీస్ యాజమాన్యం, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ట్రాఫిక్ నుండి వెసులుబాటు కల్పించక పోవటం కడు శోచనీయం. ఎంసెట్ ఎగ్జామ్ అంటే ఒక్క విద్యార్థికి రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాల శ్రమ. పరీక్షహాలుకు ఒక్క నిమిషం లేటుగా వచ్చినా అనుమతించం అనే నిబంధన పెట్టిన ఈ అధికారులు అది వర్కింగ్ డే రోజు (శుక్రవారం) పెట్టకూడదు అనే ఇంగితజ్ఞానాన్ని మరిచారా? సెలవుదినాల్లో పెడితే కొంతవరకు ఈ ట్రాఫిక్ ఇబ్బందులు తప్పేవి. గతంకి ఎంసెట్ ఎలాంటి క్రేజ్ లేని రోజుల్లో పనిదినాల్లో ఈ ఎగ్జామ్ నిర్వహించేవారు కాని ఈనాటి పరిస్థితి అది కాదు. ఎంసెట్ ఎగ్జామ్ కి ఈనాడు attend అవుతున్నవారు  లక్షల్లో ఉన్నారు. మరి అలాంటప్పుడు ఈ ఎగ్జామ్ నిర్వహించ వలసినది సెలవు రోజున కదా! (ఆదివారం)



హైదరాబాద్ లో ట్రాఫిక్ కంట్రోల్ అనేది రోజు రోజుకీ దిగజారి పోతోంది. దీనికి కారణం అధికారుల వైఫల్యం. ప్రజల యొక్క అలసత్వం. ఒక సెలబ్రిటి ఇంట్లో పెళ్ళి జరిగితే దానికి వందలమందితో పోలీస్ సెక్యూరిటీ. ఒక సినిమా ఆడియో ఫంక్షన్ జరిగితే దానికి విపరీతమైన పోలీస్ బందోబస్త్. కాని కష్టపడి చదివి పరీక్ష రాసే విద్యార్థికి మాత్రం ఎలాంటి సౌకర్యం పోలీస్ వ్యవస్థనుండి ఉండదు.



నిన్న హైదరాబాద్ లో జరిగిన ఎంసెట్ ఉదంతాన్ని చూస్తే ఎంతో మంది విద్యార్థుల ఆశలు ఆవిర్లు అయిపోయాయి . ఇప్పటికే చాలామంది విద్యార్థులు ఇంటర్లో మార్కులు సరిగా రాలేదని ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు అనేకం. కాని ఎంసెట్ అంటే చాలామందికి రెండు, మూడేళ్ళ శ్రమ. ఇలా వారి భవితవ్యాన్ని మార్చేసే హక్కు ఎవరిచ్చారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా, హాల్ టికెట్ పై ఫోటో లేకపోయినా నిర్థాక్షిణ్యంగా పరీక్షకు అనుమతించని నిబంధనలు విధిస్తూ విద్యార్థులను శాసిస్తున్న సదరు యాజమాన్యం, ఈ ట్రాఫిక్ పట్ల కూడా దృష్టి సారించాల్సిన అవసరం లేదా? అంటే వీరి ప్రతాపం అంతా అమాయకులైన ప్రజలు, విద్యార్థుల పైనేనా?



ఒక హనుమాన్ జయంతి శోభాయాత్ర,, ఒక శ్రీరామనవమి శోభాయాత్ర,, ఒక మినాదున్నబి ఇలాంటి వాటికి కల్పించే ట్రాఫిక్ బదలాయింపులు లక్షలాది మంది విద్యార్థుల విషయంలో కల్పించక పోవటం ఎంతవరకు సమంజసం. కూకట్ పల్లిలో ఉండే విద్యార్థికి పాతబస్తీలో ఎగ్జామ్ సెంటర్ కేటాయించడం అంటే, అసలు విద్యాశాఖ ఏ విధంగా పనిచేస్తోంది?



ట్రాఫిక్ పట్ల చర్యలు అంటే! C.V. ఆనంద్ దృష్టిలో ఏమిటి? తాగి కారునడిపే సెలబ్రిటీలను పట్టుకొని పేపర్లో ఫోటోలు వేయించుకోవటమా! నగరంలో ఎలాంటి సందర్భాన్ని ఎదుర్కోవలన్నా ముందుగా ట్రాఫిక్ పరంగా భయానక వాతావరణాన్ని చవిచూడాలా ప్రజలు? మనమేమీ రాతియుగంలో లేము, మాటకి ముందు హైదరాబాద్ ను మెట్రోపాలిటన్ సిటీగా పేర్కొంటూ, నగరజీవికి ట్రాఫిక్ పరంగా నిత్యం నరకాన్ని చూపిస్తుంటే, దీనికి బాధ్యులెవరు? బాధ్యులైన ట్రాఫిక్ సిబ్బంది ప్రభుత్వం రెండేళ్ళ శ్రమను బూడిదలో పోసిన చందంగా చేసేసి, నిస్సహాయంగా చూస్తున్న విద్యార్థులకు ఏం సమాధానం చెప్తారు?


రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో ట్రాఫిక్ పరంగా ప్రజలు ఇన్ని ఇక్కట్లు పడుతూ సదరు సిబ్బందిని ఎందుకు నిలదీయరు? ఈ పోలీస్ వ్యవస్థ, న్యాయవ్యవస్థ, ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ ఇవన్నీ ఉన్నది కేవలం V.I.P.లకు రక్షణ కల్పించటానికేనా? ఇన్ని అవస్థలు పడతారే కానీ ప్రజలు ఎలాంటి వ్యతిరేకతను చూపించరా? ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘనలు చేస్తూ పట్టుబడితే 100/- నుండి 1,000/- వరకు లంచం ఇచ్చి దర్జాగా వెళ్ళిపోవటం. మరి ఇక్కడ బాధ్యతారాహిత్యం ఎవరిది? ప్రజలది కాదా? ఇంతటి బాధత్యారాహిత్యంగా ఉండేవారు ప్రశ్నించే హక్కును ఎలా వినియోగించుకుంటారు?


ఎన్నో ఆశలతో ఈ ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా తమ భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం అనుకున్న విద్యార్థులను నిండా ముంచేసిన ఈ ట్రాఫిక్ కమీషనర్ C.V. ఆనంద్ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ వైఫల్యం కారణంగా విద్యార్థులు ఎంసెట్ సెంటర్ నుండి వెనుదిరిగిన వారు అనుచిత నిర్ణయం ఏదైనా తీసుకుంటే C.V. ఆనంద్ సమాధానం ఏమిటి? ఏ డిపార్ట్ మెంట్ వారైనా సరే విధి నిర్వహణలో వైఫల్యం చెందితే వారికి విధించాల్సిన సరైన శిక్ష ఏమిటి?



నిన్న కేవలం ట్రాఫిక్ కమీషనర్ C.V. ఆనంద్ బాధ్యతారాహిత్యం మరియు విధి నిర్లక్ష్యం మరియు ట్రాఫిక్ పట్ల ఎంసెట్ కు వచ్చే విద్యార్థుల సంఖ్య పట్ల అవగాహనలేమి కారణం ఫలితంగా అనేకమంది విద్యార్థులు నిస్సహాయులైపోయారు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు?

 


చివరిగా చెప్పేది ఒక్కటే ప్రభుత్వం యొక్క ప్రతి వైఫల్యంలోను ప్రభుత్వం బాధ్యత ఎంత ఉంటుందో ప్రజల వైఫల్యం కూడా అంతే ఉంటుంది. అందుకే నిరాసక్తత, నిస్తేజం నిండిన ప్రజలారా మేల్కొనండి! మేల్కొని మీ పిల్లల భవిష్యత్తుకై గళమెత్తండి!



C.V.ఆనంద్ గారికి … విద్యార్థుల తల్లిదండ్రుల అందరి తరుపున మా ఈ ప్రశ్నల పరంపరని పంపుతున్నాం. ఆయన సమాధానం ఏంటో చూద్దాం. అసలు సమాధానం వస్తుందో లేదో కూడా చూద్దాం.