అధిక చార్జీలతో ప్రయాణికులను దోచుకుంటున్న తాత్కాలిక డ్రైవర్లు,కండక్టర్లు...

 

టికెట్ ధరకు ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటాం, రద్దీకి సరిపడా బస్సులు నడుపుతున్నాం ఇది ప్రభుత్వం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తరచూ చేస్తోన్న ప్రకటన. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఎక్కడా బస్సులు సరిపోవటం లేదు, నడుస్తున్న బస్సుల ఆదాయానికి సంబంధించిన లెక్కా పత్రం లేదు. అడిగేవారు లేకపోవడంతో ప్రయాణికులు దోపిడీకి గురవుతున్నారు. సమ్మె నేపథ్యంలో నడుపుతున్న ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. ఒక్కో బస్సులో పరిమితికి మించి ప్రయాణాలు చేస్తున్నారు, మరోవైపు ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. తీరా లెక్కలేసే సరికి నష్టాలు వస్తున్నాయని అంటున్నారు ఆర్టీసీ అధికారులు.

సమ్మె నేపథ్యంలో పెద్ద సంఖ్యలో బస్సులు నడుపుతున్నా టిక్కెట్ ఇవ్వడం లేదు, టిక్కెట్ వ్యవస్థపై ఆర్టీసీ కసరత్తు చేయకపోవడంతో తాత్కాలిక కండెక్టర్ లు నోటిమాటగా ప్రయాణికుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారమంతా గుడ్డి లెక్కన సాగుతోంది. అడిగేవారు లేకపోవటంతో తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్న చాలా మంది కండెక్టర్ల పంట పండుతోంది. అధిక చార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది, దీంతో అధికారులంతా హడావుడిగా ఏర్పట్లు చేశారు. హెవీ లైసెన్స్, బ్యాడ్జి నెంబర్ ఉన్న వారిని పరీక్షించి తాత్కాలిక డ్రైవర్ లుగా నియమించారు. అలాగే పదో తరగతి పాసైన వారికి కండెక్టర్ లుగా అవకాశం కల్పించారు. సమ్మె మొదలైన నాలుగైదు గంటల్లోనే ఈ ప్రక్రియ పూర్తైంది, చేరిక సందర్భంగా ఆయా కండెక్టర్ లకు వసూలు చేయాల్సిన టిక్కెట్ చార్జీల వివరాలు ఇచ్చారు. అయినప్పటికీ కొందరు సాధారణ టికెట్ రుసుంలకు మించి ఎవరికి తోచినంతగా వాళ్లు వసూలు చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కండెక్టర్ లు బలవంతపు వసూళ్ళు చేస్తున్నారు, ప్రశ్నించే ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు.

నైపుణ్యం లేని డ్రైవర్ లు ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతూ ప్రయాణికుల్ని బెంబేలెత్తిస్తున్నారు. నిజానికి ప్రైవేటు డ్రైవర్ లు, కండెక్టర్ లను తీసుకున్నా ప్రయాణ చార్జీల్లో ఎలాంటి మార్పులూ ఉండవని అధికారులు ప్రకటించారు. నిర్ణీత ఛార్జీలు మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు. అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు, బస్సుల్లో ధరల పట్టికలను ఏర్పాటు చేశారు. అయినా క్షేత్రస్థాయి పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు, పర్యవేక్షణ లేకపోవటంతో అధికారుల ఆదేశాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. అసిఫాబాద్ లో అధిక చార్జీల వసూలుపై అక్కడి ప్రయాణికులు ఏకంగా జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు. ఆయన కండెక్టర్ ను మందలించి డబ్బులను ప్రయాణికులకు తిరిగి ఇప్పించారు. అయినా కొన్ని ఏరియాల్లో కండెక్టర్ లు అధిక మొత్తంలో వసూలు చేస్తూనే వున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. తగినన్ని వాహనాలూ అందుబాటులో లేకపోవటంతో ఉన్న బస్సుల్లోనే ఎక్కుతున్నారు.

ఫిర్యాదులు చేసినా పట్టించుకునే వారు లేకపోవటంతో కండెక్టర్ లు అడిగినంత సొమ్ము చెల్లిస్తున్నారు. రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్ చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఏమాత్రం పొంతన లేకుండా పోతోంది. సహజంగా ప్రతి రోజూ ఒక డిపో పరిధిలో ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి, ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాయి ఎందరు ప్రయాణం చేస్తున్నారు, లెక్కలకు సంబంధించిన ఆక్యుపెన్సీ రేషియో ఒక క్రమ పద్ధతిలో చూస్తారు. అయితే సమ్మె మొదలైనప్పటి నుంచి ఆ పద్ధతి పూర్తిగా అటకెక్కింది. ఈ లెక్కలకు సంబంధించి ఎక్కడా పారదర్శకత లేదు, కేవలం బస్సులు నడపడం మినహా లెక్కాపత్రం లేకుండా పోతోంది. షెడ్యూల్ ప్రకారం బస్సులు నడవక పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆరు డిపోల పరిధిలో ఆరు వందల ఇరవై నాలుగు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులున్నాయి. సమ్మె కారణంగా ఎక్కడికక్కడ తాత్కాలిక డ్రైవర్ లు, కండెక్టర్ లను నియమించుకున్నారు. వీటికి అదనంగా ప్రైవేటు బస్సులు, మ్యాక్సీ క్యాబ్స్, ఇతర వాహనాలను అందుబాటులోకి తెచ్చారు.

పండుగ సీజన్ కావడంతో ప్రతి వాహనం కిక్కిరిసిపోతోంది. అన్ని రూట్ల లోనూ భారీగా కలెక్షన్ లు వచ్చాయి, ఒక్కో బస్ లో పరిమితికి మించి ప్రయాణికులను చేరవేస్తున్నారు. కొన్ని బస్సుల్లో డ్రైవర్ లు, కండెక్టర్ లు కలిసి కలెక్షన్స్ లో కొంత భాగాన్ని నొక్కేస్తున్నారు. ఇక డిపోకు చేరుకున్న బస్సుల లెక్కల్లోనూ పారదర్శకత లేకుండా పోతోంది, ఇలాంటి సందర్భాల్లో లాభాల కంటే ప్రయాణికుల సౌకర్యమే తమకు ముఖ్యమని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పేరిట ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛను చాలా మంది తాత్కాలిక కండక్టర్ లు, డ్రైవర్ లు సొమ్ము చేసుకుంటున్నారు. లెక్కాపత్రం లేకపోవటం తో సమ్మె కాలం దొచుకున్నోడికి దోచుకున్నంతగా మారుతోంది.