రెచ్చిపోతున్న రేషన్ మాఫియా!!

తెలంగాణ, ఏపీలలో అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది.  పేదలు నోటి దగ్గరికి చేరాల్సిన రేషన్ బియ్యం సరిహద్దులు దాటిపోతుంది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి తూర్పు గోదావరి జిల్లాలోకి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కాకినాడ పోర్టు ద్వారా వేరే ప్రాంతాలకు తరలిపోతోంది. మధ్యలో ఎన్నో చెక్ పోస్టులు అధికారులు విజిలెన్స్ ఉన్నా దర్జాగా తరలించుకుపోతోంది రేషన్ మాఫియా. పశ్చిమ గోదావరి జిల్లాను అడ్డాగా చేసుకున్న అక్రమార్కులు సరిహద్దు ప్రాంతాలైన చింతలపూడి, రాఘవపురం, గురుభట్లగూడెం గ్రామాల్లో డంపులు పెట్టి లారీలతో లోడ్లకు లోడులు తరలిస్తున్నారు. వందల టన్నుల బియ్యాన్ని సరిహద్దులు దాటిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.

అయితే పలు ప్రాంతాలను నుంచి తూర్పు గోదావరి జిల్లాకు తరలించి అక్కడ రీసైక్లింగ్ చేస్తున్నారు. దగ్గర్ లోనే కాకినాడ పోర్టు ఉండటంతో ఆ దారిలో దేశంలోని ఇతర ప్రాంతాలకు సైతం పేదల బియ్యం తరలిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత మాఫియా పని మరింత ఈజీ అయ్యింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిల్లాలలోని కొందరు రైస్ మిల్లర్లు ఈ రేషన్ దందాను వెనుకుండి నడిపిస్తున్నారు. రేషన్ బియ్యాన్ని అంతా ఒక చోట చేర్చి తర్వాత పెద్దపెద్ద లోడులతో సరిహద్దులు దాటిస్తున్నాయి రైసు మిల్లర్ల యాజమాన్యాలు. రేషన్ మాఫియాతో కుమ్మక్కైన అధికారులు రేషన్ బియ్యాన్ని ఎలాంటి తనిఖీలు చేయకుండా సరిహద్దులు దాటిస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి.

కేవలం లారీలోనే కాదు వ్యాన్ లు, ఆటోల్లోనూ మూటలకు మూటలు తరలిస్తున్నారు. ఈ పాస్ విధానంలో సరుకుల పంపిణీని కూడా డీలర్ లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. కార్డుదారులు ఎక్కడైనా బియ్యాన్ని తీసుకునే సౌలభ్యాన్ని వక్రమార్గం పట్టిస్తున్నారు. ప్రతి నెల సరుకులు పంపిణీ చేయాల్సి ఉన్నా కొందరు డీలర్లు కుంటి సాకులతో లబ్ధిదారులను వెనక్కి పంపించేస్తున్నారు. చాలా చోట్ల రెండు నెలలకు ఒకసారి రేషన్ ఇస్తున్నారు. డీలర్ల తీరుతో చాలా పట్టణాల్లో లబ్ధి దారులు విసిగిపోతున్నారు. సరుకులు కూడా తీసుకోవడం లేదు. దాంతో వారి రేషన్ మాఫియా చేతికందుతోంది. రేషన్ డీలర్లు ఈ పాస్ యంత్రాల టెక్నీషియన్ లు, ఎన్ఐటీ టెక్నీషియన్ లు, వీఆర్వోలు, ఫుడ్ ఇన్ స్పెక్టర్ ల అండతో దళారీలు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. అరికట్టాల్సిన అధికారగణం చేష్టలుడిగి చూస్తుండటం పట్ల ప్రజలు మండిపడుతున్నారు.