విజయమ్మతో కొండా భేటి..తాడోపేడో

 

 

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 16 మంది సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజీనామాలు చేసిన నేపథ్యంలో గుర్రుగా ఉన్న ఆ పార్టీ తెలంగాణ నాయకులు శనివారం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో సమావేశమయ్యారు. మాజీ మంత్రి కొండా సురేఖతో పాటు ఆమె భర్త కొండా మురళి, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మహేందర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణా రెడ్డి, రవీంద్ర నాయక్‌ తదితరులు సమావేశానికి వచ్చారు.

 

సీమాంధ్ర ఎమ్మెల్యే చర్యలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కొండా దంపతులు దీనికి విజయమ్మ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణపై పార్టీ వైఖరిపై స్పష్టమైన ప్రకటన చేయాలని వారు విజయమ్మను కోరనున్నట్లు సమాచారం.

 

తెలంగాణకు వ్యతిరేకంగా వైఖరి తీసుకుంటే తాము పార్టీకి రాజీనామా చేస్తామని కూడా వాళ్లు తేల్చిచెప్పనున్నారు. ప్లీనరీలో తెలంగాణకు అనుకూలంగా చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నామని మాటల్లో చెబుతున్నా, చేతల్లో మాత్రం సమైక్యానికి అనుకూలంగా కనిపిస్తోందని, ఇది తమను తమ ప్రాంతాల్లో ఇబ్బందులకు గురి చేస్తోందని వారు నివేదించనున్నారు.