మావోయిస్టులకే మన ఓటు!

 

 

 

ఎన్నికలకూ, మావోయిస్టులకూ మధ్య చాలా దూరం వుంది. తుపాకి గొట్టంతోనే రాజ్యాధికారం సాధించుకోవాలని చెప్పే మావోయిస్టులు ప్రజాస్వామ్య ప్రక్రియ అయిన ఎన్నికలలోకి తాము దూరంగాక దూరమని చెబుతూ వుంటారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వాటిని బహిష్కరిస్తూ వుంటారు. ఓటు అడిగేవాళ్ళని, ఓటు వేసేవాళ్ళని బెదిరిస్తూ వుంటారు. బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపులు ఇస్తూ వుంటారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలు కలిగిస్తూ వుంటారు. అలాంటి మావోయిస్టులు ఎన్నికల మీద మోజు పెంచుకున్నట్టు కనిపిస్తోంది.

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ కార్యకలాపాలకు సురక్షితమైన హెడ్ క్వార్టర్‌గా తెలంగాణ ఉపయోగపడుతుందని మావోయిస్టులు ఆశిస్తున్నారు. అందుకే ముందూ వెనుకా ఆలోచించకుండా రాష్ట్ర విభజనకు సంపూర్ణ మద్దతు ప్రకటించేశారు. కొంతమంది మావోయిస్టులైతే తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పాల్గొంటున్నారు కూడా!  తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యులైన మావోయిస్టులు ఇప్పుడు తెలంగాణ వచ్చాక అధికారంలో కూడా భాగస్వాములు అవ్వాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.




అధికారంలో వుండటం ద్వారా మావోయిస్టు ఉద్యమానికి రాజకీయ మద్దతు కూడగట్టుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికలలో తెలంగాణ వ్యాప్తంగా కొన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని మావోయిస్టులు భావిస్తున్నట్టు సమాచారం. మావోయిస్టులు పోటీ చేసే నియోజకవర్గాలలో ఇతర పార్టీలు అభ్యర్థులను పోటీకి నిలపకుండా చేసే ఉద్దేశం కూడా వుంది. అలా చేయడం ద్వారా పోటీలో నిలబడిన మావోయిస్టులందరూ తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికవుతారు. మావోయిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేసే ప్రయాణంలో ముందడుగు వేస్తారు. తమ ఆలోచనకు తెలంగాణలోని రాజకీయ పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తుందని మావోయిస్టులు ఆశిస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన తమకు రాజకీయ పార్టీల నుంచి సహకారం సులభంగానే లభిస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ సహకారం లభించకపోయినా సహకారం ఎలా పొందాలో మావోయిస్టులకు బాగా తెలుసు కదా!