సచివాలయం కూల్చేస్తే.. మరి ప్యాలెస్ సంగతేంటీ?

ఆరో నిజాం నుంచి ఎన్టీఆర్ వరకు పరిపాలన సాగించిన భవనం..
బకింగ్ హామ్ ప్యాలెస్ నమూనాలోని అరుదైన నిర్మాణం..
సంప్రాదాయ యూరోపియన్ శైలీలో ఆకట్టుకునే రాజసం..
నాడు ఆరో నిజాం, నేడు కేసీఆర్ వాస్తు బాగలేదన్నారు..
132ఏండ్ల చారిత్రక భవనం మ్యూజియంగా మారనుందా?..

తెలంగాణ ప్రభుత్వం సచివాలయ భవన సముదాయాన్ని కూల్చివేయాలన్న నిర్ణయానికి ఎట్టకేలకు న్యాయవ్యవస్థ నుంచి ఆమోదం లభించింది. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయవద్దంటూ ప్రతిపక్షాలతో పాటు చారిత్రక పరిశోధకలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా పరిపాలనా కేంద్రం లేదన్న ప్రభుత్వ వాదనతో హైకోర్టు తన తుదితీర్పు వెల్లడించింది. దాంతో కొన్ని నెలలపాటు సాగిన ఉత్కంఠకు తెరపడింది. అయితే సచివాలయం మధ్యలో ఉన్న జీ బ్లాక్ గా మార్చబడిన సైఫాబాద్ ప్యాలెస్ సంగతేటనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఎందరో ముఖ్యమంత్రుల కార్యాలయంగా..
ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బూర్గుల రామకృష్ణారావు నుంచి నందమూరి తారక రామారావు వరకు ఎంతో మంది ముఖ్యమంత్రుల పరిపాలన కేంద్రంగా ఉన్న సైఫాబాద్ ప్యాలెస్ నేడు శిథిలావస్థలోకి చేరుకుంది. నిజాం ఆరో నవాబు మహబూబ్ అలీ ఖాన్ 1887లో ఈ ప్యాలెస్ ను నిర్మణం ప్రారంభించారు. లండన్ లోని బకింగ్ హామ్ ప్యాలెస్ ను పోలిన విధంగా సంప్రదాయ యూరోపియన్ నిర్మాణశైలీలో ఈ భవనాన్ని నిర్మించారు. డంగ్ సున్నం, వివిధ ప్రాంతాలతో తెచ్చిన ప్రత్యేకమైన రాళ్లతో కట్టిన ఈ భనవం రెండస్తుల్లో ఉంటుంది. మధ్యలో విశాలమైన మెట్లు రాజసం ఉట్టి పడేలా ఉంటాయి. అర్థచంద్రాకార గుమ్మటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇంజనీర్ల నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచిన ఈ భవనంతో ఎండాకాలంలోనూ చల్లగా ఉండేదట. బర్మా టేకుతో చేసిన గుమ్మాలు, కిటికీలు నేడు లక్షల ఖరీదు పలుకుతాయి.

నివాసయోగ్యం కాదని...
పురానీ హవేలీలో నివాసం ఉండే మహబూబ్ అలీ ఖాన్ అనారోగ్యం కారణంగా తమ మకాం హూసేస్ సాగర తీరంలో ఆహ్లాదవోకరమైన వాతావరణంలో నిర్మించిన సైఫాబాద్ ప్యాలెస్ కు మార్చాలని అనుకుంటాడు. తమ ప్రధాన మంత్రి కిషన్ ప్రసాద్తో కలసి ఏనుగు అంబారీపై ప్యాలెస్ కు వస్తుండగా అపశకునం ఎదురైందని, ఈ ప్యాలెస్ నివాస యోగ్యం కాదని జోతిష్యులు చెబుతారు. దాంతో నిజాం ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ఈ భవనాన్ని తన ఆర్థిక మంత్రి సర్ అక్బర్ హైద్రీ కోసం కేటాయిస్తారు. ఆ రోజు నుంచి పైఫాబాద్ ప్యాలెస్ పరిపాలన భవనంగా మారిపోయింది. 1888 నుంచి ఈ భవనంలో అనేక శాఖల కార్యకలాపాలు జరిగాయి.

జీ బ్లాక్ నుంచి సర్వహితగా..
హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై, ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బూర్గుల రామకృష్ణారావు నుంచి నందమూరి తారక రామారావు వరకు ఎంతో మంది ముఖ్యమంత్రుల కార్యాలయంగా సైఫాబాద్ ప్యాలెస్ మారింది. ఎన్టీఆర్ ఈ ప్యాలెస్ లో మార్పులు చేయాలని భావిస్తే అప్పటి సిఎస్ నరేంద్ర లూథర్ ఆయన ప్రతిపాదను వ్యతిరేకింటారు. చారిత్రకాత్మకమైన కట్టడం రూపురేఖలు మారిస్తే వారసత్వ సంపదను కోల్పోతామని ఆయన చెప్పిన మాటలకు ఫిదా అయిన ఎన్టీఆర్ ఈ ప్యాలెస్ ను యథాతథంగా కొనసాగించారు. సర్వహితగా పేరు మాత్రం మార్చగలిగారు.
ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు జీ బ్లాక్ రూపురేఖలు మార్చే ప్రయత్నం చేయగా ప్రజాసంఘాల నుంచి వ్యతిరేకత వచ్చింది. దాంతో ఆయన తన కార్యకలాపాలను సీ బ్లాక్(సమత బ్లాక్) నుంచి నిర్వహించారు. 1994 నుంచి 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాడే వరకు సీ బ్లాక్ ముఖ్యమంత్రి కార్యాలయంగా, జీ బ్లాక్ లో మంత్రుల కార్యాలయాలతో పాటు మీడియా సెల్ కూడా ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత ఎ,బి,సి,డి బ్లాక్ల లు తెలంగాణకు కేటాయించగా జె, ఎల్, కె,జీ, హెచ్ బ్లాక్ లను ఆంధ్రకు కేటాయించారు. జీ బ్లాక్ లో కార్యకలాపాలు తగ్గిపోవడంతో క్రమంగా శిథిలావస్థకు చేరింది.

వారసత్వ వారధి..
తెలంగాణ ప్రభుత్వం సచివాలయంలోని అన్నీ బ్లాక్ లను కూలగొట్టి ఆధునాతనంగా నిర్మించాలన్న యోచనలో ఉంది. అయితే అన్ని బ్లాక్ ల మధ్యలో, 132ఏండ్ల వయసుతో నాటి నిజాంల పాలనకు.. నేటి తెలంగాణ అస్తిత్వానికి, వారసత్వానికి వారధిగా ఉన్న సైఫాబాద్ ప్యాలెస్ ను ఏం చేస్తారో వేచి చూడాల్సిందే..

వారసత్వ సంపదను కాపాడాలి...
హైదరాబాద్ నగరంలో ఎన్నో విభిన్న శైలీ నిర్మాణాలు ఉన్నాయి. యూరోపియన్, పర్షన్ సంప్రదాయతీరులో కట్టిన కట్టడాలు ఒకే పట్టణంలో ఉండటం చాలా అరుదు. అలాంటి భిన్నశైలీ నిర్మాణాలను వారసత్వ సంపదగా మనం కాపాడుకోవాలి.
-అనురాధ, ఇంటెక్