ఆర్టీసీ సమ్మెపై కేంద్రం జోక్యం..! అమిత్ షా దగ్గరకు అశ్వద్ధామరెడ్డి..?

 

ఒకవైపు కేసీఆర్ డెడ్ లైన్ ముంచుకొస్తోంది... మరోవైపు ఆత్మగౌరవాన్ని చంపుకొని విధుల్లోకి వెళ్లొద్దంటూ యూనియన్లు పిలుపునిస్తున్నాయి. దాంతో, ప్రభుత్వం ఇచ్చిన ఆఖరి అవకాశాన్ని వినియోగించుకోవాలా? లేక జేఏసీ చెప్పినట్లు వినాలో తెలియక ఆర్టీసీ కార్మికులు నలిగిపోతున్నారు. మంగళవారం అర్ధరాత్రితో కేసీఆర్ డెడ్ లైన్ ముగియనుండటంతో కార్మికులు ఎటూతేల్చుకోలేకపోతున్నారు. విధుల్లో చేరాలా? వద్దా? అని తర్జనభర్జనలు పడుతున్నారు. అయితే, హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో కొందరు కార్మికులు విధుల్లో చేరడంపై యూనియన్ లీడర్లు మండిపతుతున్నారు. రీ-జాయిన్ అవుతున్న కార్మికులను అడ్డుకుంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, విధుల్లో చేరుతున్న కార్మికులను ఎవరైనా అడ్డుకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పోలీస్ బాస్ లు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు నిర్భయంగా విధుల్లో చేరవచ్చని, అలా చేరిన వారికి చట్టప్రకారం రక్షణ కల్పిస్తామని... హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు తెలిపారు. బెదిరింపులకు పాల్పడినా, భౌతికదాడులకు దిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, సర్కారు విధించిన గడువులోపు ఎంతమంది కార్మికులు విధులకు హాజరవుతారనేది ఉత్కంఠగా మారింది.

ఒకరిద్దరు పిరికివాళ్లు మాత్రమే విధుల్లో చేరుతున్నారని, మిగతా కార్మిక లోకమంతా సమ్మెలోనే కొనసాగుతున్నారంటోన్న జేఏసీ... సీన్‌ను హస్తినకు మార్చాలని నిర్ణయించింది. కేసీఆర్ డెడ్ లైన్ తో ఆర్టీసీ సమస్యను ఢిల్లీకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి సమస్యను వివరించాలని నిర్ణయించారు. అలాగే, కేసీఆర్ ప్రభుత్వ తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్ సర్కారుతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన ఆర్టీసీ కార్మిక జేఏసీ... తొమ్మిదిన ట్యాంక్ బండ్ పై భారీ నిరసనకు ఏర్పాట్లు చేస్తోంది.