ఆర్టీసీ సమ్మె ఇంత తీవ్రంగా మారడానికి మంత్రుల మాట వైఖరే కారణమా?

ఆర్టీసీ సమ్మె సందర్భంగా కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా తయారైంది అధికార టీఆర్ఎస్ ముఖ్య నేతలు పరిస్థితి. నిజానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఒక రకమైన గందరగోళం కనిపిస్తోంది.పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని సమర్థించే విషయంలో మెజారిటీ ఎమ్మెల్యేలు తప్పించుకు తిరుగుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. సమ్మెకు ప్రజల నుంచి సానుభూతి వెల్లువెత్తుతున్నందున అనవసరంగా తిట్లు తినడం దేనికన్న భావనతో నేతలు నోరుతెరవడంలేదంటూ ఆరోపణలు వెల్లువడుతున్నాయి. చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియాకు దూరంగా ఉంటున్నారని, మీడియా ప్రతి నిధులు మాట్లాడించాలని చూసినా సమ్మె విషయం తప్ప ఏదైనా అడగాలని జవాబు ఇస్తూ అసలు విషయాన్ని దాటేస్తున్నారు . దాదాపు మెజారిటీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇదే వైఖరిని అవలంబిస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి దసరా సెలవుల్లో సమ్మె చేస్తుండడంతో తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ప్రజల మద్దతు ఉండదని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ సమ్మెను తీవ్రంగా పరిగణిస్తూ కార్మికులకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని ప్రకటించారు సీఎం. సీఎం ఆగ్రహంగా ఉండటంతో రవాణా శాఖ మంత్రి అజయ్ ఇతర మంత్రులు తలసాని, ఎర్రబెల్లి, మల్లారెడ్డి వంటి వారు మరింతగా రెచ్చిపోయారు.ముఖ్యమంత్రి మన్ననలనూ పొందాలనుకున్నారేమో గాని వాళ్లు సమ్మె విషయంలో మాట్లాడే ప్రతి మాట సోషల్ మీడియాలో వైరల్ అయింది.అసలు తెలంగాణ ఉద్యమంతో సంబంధంలేని ఏనాడూ ఉద్యమంలో పాల్గొనని వాళ్లు కూడా కార్మికులను బెదిరించడం ఏమిటనే అంశం ప్రజల్లోకి బలంగా వెళ్లింది.

ఈ పరిణామం ప్రజల్లో ఆర్టీసీ కార్మికుల పట్ల సానుభూతిని పెంచింది. తెలంగాణ ఉద్యమ సమయంలో పాల్గొనని వారికి మంత్రి పదవులు ఇవ్వడమే కాకుండా వారితో సమ్మెలో ఉన్న కార్మికులకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారన్న అంశం గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా బలంగా వెళ్తోంది. మరీ ముఖ్యంగా తలసాని, ఎర్రబెల్లి, అజయ్ ,మల్లారెడ్డి లాంటి వాళ్లు తమ తమ ప్రాంతాల్లో బలమైన నాయకులైన వీరిని తెలంగాణ సమాజం ఉద్యమకారులుగా గుర్తించే పరిస్థితి లేదు. పదవుల కోసమే వీరు టీఆర్ఎస్ లో చేరారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఈ క్రమంలో సమ్మె విషయంలో వీరి స్పందన ప్రభుత్వ అంచనాను పూర్తిగా తలకిందులు చేస్తుంది. ఆర్టీసీ కార్మికులకు రోజురోజుకు ప్రజల మద్దతు పెరుగుతూ వస్తోంది. ఈ ప్రతికూల పరిస్థితి టీఆర్ఎస్ కు శరాఘాతంగా మారుతుందన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. నిజానికి సమ్మె ప్రారంభంలో అతిగా స్పందించి మంత్రులు మరోసారి సెంటిమెంట్ ను తట్టిలేపారు మీరు మాట్లాడిన తర్వాత తాము మాట్లాడుకుంటే కేసీఆర్  ఏమనుకుంటారో అన్న భావనతో మిగతా మంత్రులు స్పందించారు.ఇందులో కొత్తగా మంత్రైన గంగుల కమలాకర్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అయినా ఇంకా పలువురు మంత్రులు సమ్మె విషయంలో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు.ఏదో మాట వరుసకు సమ్మె వెనుక విపక్షాలు ఉన్నాయని ఆరోపించటం మినహా స్ట్రైక్ ను మాత్రం పూర్తిగా తప్పుబట్టడం లేదు.ప్రస్తుత పరిస్థితుల్లో ఏం మాట్లాడినా అనవసరంగా తలనొప్పి ఎదురయ్యే అవకాశముందని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది.మరికొందరు హుజూర్ నగర్ ప్రచారమంటు అందుబాటులో లేకుండా పోవడం గమనార్హం.