ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమణ.. ఏం సాధించారని?

 

తెలంగాణ లో గత 47 రోజులుగా సాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె కి నేటితో తెరపడింది. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు సిద్ధమని జేఏసీ నేతలు ప్రకటించారు. బుధవారం ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సహా పలువురు జేఏసీ నేతలు హాజరయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన జేఏసీ నేతలు కీలక ప్రకటన చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నామని అశ్వత్థామరెడ్డి తెలిపారు. లేబర్ కోర్డులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం, యాజమాన్యం కూడా ఈ తీర్పును గౌరవించాలని కోరారు. కానీ దేనికోసమైతే కార్మికులు సమ్మె బాట పట్టారో.. అందులో ఏ ఒక్క డిమాండ్ కూడా నెరవేరకుండానే సమ్మెని ముగిస్తుండటం కొసమెరుపు. ఈ సమ్మె మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు, పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరి ఇన్నిరోజులు సమ్మె చేసి కార్మిక సంఘాలు ఏం సాధించాయో వారికే తెలియాలి.