రెవెన్యూ ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారా? కేసీఆర్ హెచ్చరికలు ఫలితమేనా ఇది?

తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులపై ఇటీవల ఒత్తిడి పెరిగింది. రెవెన్యూశాఖలో అవినీతి పెరిగిపోయిందని, రెవెన్యూ ఉద్యోగులు ప్రజలను, రైతులను పీక్కు తింటున్నారని, ఇక ఉపేక్షించేది లేదని, సమూల ప్రక్షాళన చేస్తామంటూ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే పలుమార్లు హెచ్చరించడంతో... మొత్తం రెవెన్యూ యంత్రాంగమే తీవ్ర ఒత్తిడికి గురైంది. అసలు రెవెన్యూ వ్యవస్థనే రద్దు చేస్తారన్న ప్రచారం సాగడంతో ఒకానొక టైమ్ లో ఆందోళన బాటపట్టేందుకు కూడా సిద్ధమయ్యారంటే వాళ్ల మానసిక పరిస్థితిని అర్ధంచేసుకోవచ్చు.

అయితే, లంచం ఇవ్వనిదే రెవెన్యూ ఉద్యోగులు ఏ పనీ చేయరనే ఆరోపణల్లో నిజమున్నా... విధి నిర్వహణలో మాత్రం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా రెవెన్యూ ఉద్యోగులపై పొలిటికల్ ప్రెజర్ ఎక్కువగానే ఉంటుంది.  నేరుగా ప్రజలతో సంబంధాలుండే డిపార్ట్ మెంట్ కావడంతో... అటు ప్రజాప్రతినిధులను, ఇటు జనాన్ని... ఇద్దరినీ మెప్పిస్తూ ముందుకు సాగాల్సిన బాధ్యత వీళ్లపై ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే పదిమందికి జవాబుదారీగా ఉంటూ పనితీరుతో మెప్పించాల్సి ఉంటుంది. దాంతో రెవెన్యూ యంత్రాంగంపై ఒత్తిడి కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. మరో కోణంలో ఆలోచిస్తే, రెవెన్యూ ఆఫీసుకు వచ్చేవాళ్లకు ఒక్కటే పని అయితే, ఆయా అధికారులకు మాత్రం పది రకాల పనులు ఉంటాయి. దాంతో ఒక్కోసారి ఆయా పనులు వాయిదా పడొచ్చు. ఆలస్యం కావొచ్చు. అలాగే, రాజకీయ ఒత్తిడులకు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొన్ని పనులు చేయాల్సి రావొచ్చు. అలాగే, అందర్నీ మెప్పిస్తూ పనులు చక్కబెట్టడమంటే కత్తి మీద సామే. అయితే, రెవెన్యూ ఉద్యోగుల ధనదాహం, లంచగొండితనం, అవినీతి అక్రమాలపైనా అదే స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి.

ఏదేమైనా తహశీల్దార్ విజయారెడ్డి పాశవిక హత్యపై రెవెన్యూ యంత్రాంగం భగ్గుమంటోంది. బంద్ కి పిలుపునిచ్చిన రెవెన్యూ ఉద్యోగులు... రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నారు.