తెలంగాణాకు ఎవరు అడ్డుపడుతున్నారు

 

తెలంగాణా ఏర్పాటుకు అడ్డుపడుతున్నది కాంగ్రెస్ నేతలా? సీమంధ్ర వలసవాదులా? లేక వేరవరయినా అడ్డుపడుతున్నారా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ప్రజలను మోసం చేస్తోందా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికితే, ముందుగా తప్పు పట్టవలసింది వారెవరినీ కాదు, తెలంగాణా సాధనే తన జీవిత ధ్యేయమని ప్రకటించుకొంటున్న కేసీఆర్నే తప్పుపట్టవలసి ఉంటుంది.

 

తెరాసను విలీనం చేసుకొని తనకు తెలంగాణాలో ఎదురులేకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ఆలోచన. తెరాస విలీనమే తెలంగాణా ఏర్పాటుకి ప్రధాన షరతుగా కాంగ్రెస్ భావిస్తూ ఎత్తులు వేస్తుంటే, నిన్న మొన్నటివరకు ‘తెలంగాణా కోసం కాంగ్రెస్ లో విలీనానికి కూడా సిద్దమే, కానీ కాంగ్రెస్ పార్టీయే వెనుకంజ వేస్తోందని’ వాదిస్తూవచ్చిన కేసీఆర్, ఇప్పుడు తెలంగాణా అంశం చివరిదశకు చేరుకొన్న తరువాత, తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేసినట్లయితే, తమ రాజకీయ ప్రయోజనాలు దెబ్బ తింటాయనే భయంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనానికి ఒప్పుకోకపోవడం గమనిస్తే, ఆయనకి తెలంగాణా సాధన కంటే తమ పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని అర్ధం అవుతోంది.

 

తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత, అది తమను మోసం చేయవచ్చుననే భయాలు కూడా ఆయనకు ఉండి ఉండవచ్చును. కానీ అదే జరిగితే, ఆయన తన పార్టీ సభ్యులందరినీ తీసుకొని కాంగ్రెస్ నుండి బయటకి వచ్చి మళ్ళీ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోవడం పెద్ద పనేమీ కాదు. ఈ సంగతి కేసీఆర్ కి తెలియకపోదు. అయినప్పటికీ, ఆయన విలీనానికి మొగ్గు చూపకుండా స్వయంగా తెలంగాణాను అడ్డుకొంటూనే, కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని, సీమంధ్ర వలసవాదులు తెలంగాణా ఏర్పాటుకు అడ్డుపడుతున్నారని ఆరోపించడం ఆయన నిజ వైఖరికి అద్దం పడుతోంది.

 

కాంగ్రెస్ తెరాసను తనలో విలీనం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే, కేసీఆర్ తెలంగాణా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పేందుకు ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని, ఒకవేళ కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చినా తమ పార్టీ తెలంగాణా పునర్నిర్మాణ ప్రక్రియలో చురుకుగా పాల్గొంటుందని చెప్పడం గమనిస్తే, ఆయనకు తెలంగాణా రావడం కంటే ఉద్యమం కొనసాగించడం, తన పార్టీ మనుగడని రక్షించుకోవడమే ముఖ్యమని భావిస్తునట్లు అర్ధమవుతోంది.

 

సమైక్యాంధ్ర కోరుతున్నలగడపాటి, రాయపాటి, శైలజానాద్, టీజీ. వెంకటేష్ వంటి నేతలు రాష్ట్ర విభజన జరగకుండా, తెలంగాణా ఏర్పడకుండా అడ్డుపడుతున్నారంటే అర్ధం చేసుకోవచ్చును. కానీ, తెలంగాణా సాధనే తన ఏకైక లక్ష్యం అని చెప్పుకొంటున్న కేసీఆరే స్వయంగా ఇప్పుడు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు జరగకుండా ఎందుకు అడ్డుపడుతున్నట్లు? తెలంగాణా సాధన కొరకే ఆవిర్భవించిన తెరాసను, అది నెరవేరబోతున్నపుడు దానిని కాంగ్రెస్ పార్టీలో కలపడానికి ఎందుకు వెనకాడుతున్నట్లు?

 

తన మాటకారితనంతో కేసీఆర్ తెలంగాణా ప్రజలను ఎంతకాలం మభ్యపెట్టగలనని భావిస్తున్నారు? ప్రజలు ఆయన ఆలోచనలను, ఉద్దేశ్యాలను గమనించలేరని భావించడం వలననే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారా? అది సాధ్యమేనా?