దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఎలా... ఎప్పుడు... జరిగిందంటే...

 

దిశ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం... ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో... తెలంగాణ పోలీసులు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. చెప్పినట్లుగానే... ఘటన జరిగిన 24గంటల్లోపే నిందితులను పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు... చట్ట ప్రకారం ముందుకెళ్తూనే... అత్యంత జాగ్రత్తగా, తెలివిగా, వ్యూహాత్మకంగా ముందుకెళ్తారు. ఇక, తీవ్ర ఉద్రిక్తతలు, నిరసనల మధ్య నిందితులను షాద్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి చర్లపల్లి జైలుకు తరలించిన పోలీసులు... ఆ తర్వాతే అసలు కథను నడిపారు. కేసు దర్యాప్తు కోసం నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేసిన సైబరాబాద్ పోలీసులు... న్యాయస్థానం ఉత్తర్వులు కోసం ఎదురుచూశారు. డిసెంబర్ ఐదున చర్లపల్లి జైలు నుంచి నిందితులను కస్టడీకి తీసుకున్న పోలీసులు... దిశ హత్యాచారం జరిగిన ప్రాంతంలో సీన్ రీ-కన్ స్ట్రక్షన్  చేసేందుకు ప్రయత్నించారు. అర్ధరాత్రి పన్నెండున్నర తర్వాత తొండుపల్లి టోల్ గేట్ దగ్గరకు నిందితులను తీసుకొచ్చారు.

అక్కడ ఎలా దిశపై సామూహిక అత్యాచారం చేశారో... ఎలా దిశను ట్రాప్ చేశారో సీన్ రీ-కన్ స్ట్రక్షన్ చేశారు. ఇదంతా దాదాపు అర్ధరాత్రి ఒంటి గంటన్నర వరకు జరిగింది. ఆ తర్వాత అంటే... శుక్రవారం తెల్లవారుజామున మూడున్నర ప్రాంతంలో చటాన్ పల్లి ప్రాంతానికి దిశ నిందితులను తీసుకొచ్చిన పోలీసులు... అక్కడేం ఎలా జరిగిందో సీన్ రీ-కన్ స్ట్రక్షన్ చేసే ప్రయత్నం చేశారు. దిశను ఎక్కడైతే కాల్చిచంపారో... ఆ ప్రాంతంలో... ఆరోజు ఏం చేశారో... చేసి చూపించాలని నిందితులకు పోలీసులు సూచించారు. అయితే, సీన్ రీ-కన్ స్ట్రక్షన్ చేస్తుండగా... నిందితులు తిరగబడ్డారని... రాళ్లు రువ్వడమే కాకుండా... ఆయుధాలను లాక్కునేందుకు ప్రయత్నించడంతో కాల్చిచంపినట్లు పోలసులు చెబుతున్నారు.